తహశీల్దార్‌ పెంపుడు కుక్కకు బంగారు చెవి పోగు

వెలకట్టిన ఏసీబీ అధికారులు
కర్నూలు, జూలై 31: కల్లూరు తహశీల్దారుగా పనిచేసిన టీ. అంజనాదేవీని రెండు రోజుల క్రితం అక్రమాస్తుల విషయంలో ఏసీబీ అధికారులు అరెస్టు చేసి, చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆమె ఇంటిని సోదా చేసినప్పుడు పలు ఆసక్తికర ఘటనలు వెలుగుచూశాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న అంజనాదేవీ ఇంట్లోని విదేశాలకు చెందిన రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయి. అందులో ఓ కుక్క చెవికి బంగారు చెవిపోగును చేయించారు. దీని విలువ రూ.30వేలు ఉన్నట్టుగా అధికారులు అంచనావేశారు. ఏసీబీ సోదాలలో తేలిన అక్రమాస్తులలో ఈ కుక్క చెవిపోగును కూడా వెలకట్టినట్టు ఏసీబీ అధికారులు చూపడం విశేషం. అలాగే ఆ రెండు కుక్కల వెల సుమారు లక్ష రూపాయలకుపైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.