తుస్సుమన్న సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సభ

సగం మందికి పైగా గైర్హాజరు
తీర్మానం లేకుండానే ముగిసిన సమావేశం
హైదరాబాద్‌ , సెప్టెంబర్‌ 22 (జనంసాక్షి) :
తెలంగాణ ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవడం, తెలంగాణ మార్చ్‌కు సన్నాహాలు జోరుగా సాగుతుండడం, మార్చ్‌ దడతో పాలకుల్లో చలనం వచ్చి, ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటుండడం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే అవకాశముందని మీడియాలో వార్తలు వస్తుండడంతో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల గుండెలు గుభేలుమన్నట్టున్నాయి. గతంలో వచ్చిన తెలంగాణను రాజీనామాల డ్రామాలాడి అడ్డుకున్నట్లు ఈసారి కూడా అడ్డుకోవడానికి కుట్రలు చేయడానికి పూనుకున్నారు. తెలంగాణ వస్తే ఎక్కడ హైదరాబాద్‌లో తాము విస్తరించుకున్న వ్యాపార సామ్రాజ్యం పతనమవుతుందోనని, ఊరంతా కాలుతుంటే ఓ స్వార్థపరుడు తన ఇంటిని తడుపుకున్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో హడావిడిగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తమ బలాన్ని నిరూపించే ప్రయత్నం చేశారు. కానీ, శనివారం జరిగిన సమావేశానికి సీమాంధ్రకే చెందిన సగం మంది ప్రజాప్రతినిధుల నుంచే ఏ మాత్రం స్పందన లేకుండా పోయింది. దీంతో సగం మంది గైర్హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సీమాంధ్ర ప్రతినిధులు ఏదో షాక్‌ ఇద్దామని పెట్టుకున్న ఈ సమావేశం తుస్సుమంది. సగం మంది గైర్హాజరు కావడంతో పట్టుమని పది నిమిషాలు సమావేశం నిర్వహించకుండానే సదరు నాయకులు సమావేశాన్ని ముగించారు. ఇదిలా ఉంటే శనివారంతో అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో ఎక్కువ సీమాంధ్ర నాయకులు ఈ సమావేశానికి హాజరవుతారని నిర్వాహక పుంగవులు భావించారు. కానీ, స్పందన చూసి కంగుతిన్నారు. ముఖ్యంగా రాయలసీమ నాయకులు దూరంగా ఉన్నారు. సమావేశం జరుగుతుండగానే జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి సమావేశానికి కూడా తాము అడ్డుగా ఉండబోమని ప్రకటించారు. టీజీ వెంకటేశ్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. చివరిగా ఎలాంటి తీర్మానం లేకుండానే సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశం సమాప్తం కావడం కొసమెరుపు.