తెదేపాను ఎవ్వరు వీడిపోవటం లేదు

గుంటూరు, జూన్‌ 24 : వైకాపా దోపిడీ దొంగల పార్టీ అని, అటువంటి పార్టీలోకి తెదేపా నుంచి ఎవ్వరూ వెళ్లడం లేదని జిల్లా తెదేపా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నేతలు వైకాపాలో చేరుతున్నట్లు ఆ పార్టీ నేతలతో పాటు, సాక్షి పత్రిక అసత్య ప్రచారం చేస్తుందని విమర్శించారు. గాలి వాటాన ఎదో రెండు సీట్లు గెలవగానే తెదేపా నేతలపై లేనిపోని ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే గ్రామ, వార్డు, డివిజన్‌ కమిటీ ఎన్నికలు 50 శాతం పూర్తయ్యాయని, మిగిలిన కమిటీలు కూడా నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. జులై మొదటి వారంలో మండల పట్టణ కమిటీలను ఎన్నికలు నిర్వహిస్తాయని అదే నెలాఖరుకు జిల్లా కమిటీ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎమ్మెల్యే దూళ్ళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ రైతులకు సరిపడిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సమావేశంలో వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య తదితరులున్నారు.