తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ మట్టికొట్టుకుపోతది

మాజీ మంత్రి దామోదర్‌రెడి

హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి): తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దామోదర్‌రెడ్డి కోరారు. బుధవారంనాడు విలేకరులతో మాట్లాడుతూ డిసెంబరు 9, 2009న చేసిన ప్రకటనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ నాన్చుడు ధోరణిని అవలంభిస్తే తెలంగాణలో పార్టీ మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండకపోతే తీరని నష్టం వాటిల్లుతుందని ఎఐసిసి దూత వాయలార్‌ రవి గ్రహించాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు లగడపాటి రాజగోపాల్‌, టీజీ వెంకటేష్‌ అడ్డుపుల్లలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుం టున్నారు తప్ప ముఖ్యమంత్రి పదవిని కాదని ఆయన అన్నారు. వారి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అయితే వారి వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పార్టీకి నష్టం వాటిల్లుతోందన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని, అందుకే ఉప ఎన్నికల్లో వైఫల్యాలను చవిచూడాల్సి వస్తోందని ఆయన అన్నారు. 2014లో సమైక్య రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ పార్టీ చాలా నష్టపోతుందని ఆయన అన్నారు. తెలంగాణ ్డఇవ్వని పక్షంలో రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ పార్టీకి నష్టమేనన్నారు. తెలంగాణ ఇస్తే 17 ఎంపీ స్థానాలు కాంగ్రెస్‌కే దక్కుతాయన్నారు. అయిదు సంవత్సరాల పాటు మంత్రులుగా పనిచేసినవారే ఇక పార్టీ కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాంతం వారికి సిఎం పదవి కావాలంటే గడచిన రెండేళ్ల కిందటే వచ్చి ఉండేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పటిష్టత కోసం మంత్రులు తమ పదవులను త్యాగం చేయాలని దామోదర్‌రెడ్డి కోరారు.