తెలంగాణ ఏర్పాటు దిశగా యూపీఏ

తెలంగాణ అంశంపై సానుకూల నిర్ణయాన్ని ప్రకటించే దిశగా కేంద్రం అడుగులేస్తోరది. ఉప ఎన్నికల అనంతరం మారిన రాజకీయ సమీకరణలతో ఒక్కసారిగా తెలంగాణ అంశం ఢిల్లీ పెద్దలకు వేడి పుట్టించింది. దీంతో వారిలో కదలిక మొదలైంది. తెలంగాణ అంశంతోపాటు రాష్ట్ర కేబినెట్‌ విస్తరణకు కాంగ్రెస్‌ అధిష్టానం తుది రూపం ఇచ్చే పనిలో నిమగ్నమైపోయింది. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు ఒకవైపు,  రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రభృతులు మరో వైపు, రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఇంకో వైపు ఢిల్లీ పెద్దలతో భేటీ అవుతుండటం ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.తెలంగాణ ప్రాంత ఎంపీలు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసి పార్టీ అధినేత్రి, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కేంద్రమంత్రులు వయలార్‌ రవి, ఏకే ఆంటోనీ తదితరులతో భేటీ అయిన తెలంగాణ అంశాన్ని వెంటనే తేల్చాలని, ఏ మాత్రం నాన్చివేత ధోరణి అవలంబించకుండా సానుకూల నిర్ణయాన్ని ప్రకటించాలని, ఇందుకు ఇదే అనువైన సమయమని నొక్కి చెప్పారు. అలాగే మంగళవారం తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు కేంద్ర హోంశాఖ మంత్రి పి.చిదంబరంతో సమావేశమైన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ మంగళవారమంతా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఇదే సమయంలో టీ కాంగ్రెస్‌ ఎంపీలు కూడా కేంద్రంలో కీలకమైన మంత్రులతో భేటీ అవుతున్నారు. సోమవారం సోనియాను ఆమె నివాసంలో కలుసుకున్న నరసింహన్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి, పరకాలలో టీఆర్‌ఎస్‌, సీమాంధ్రలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు దారితీసిన పరిస్థితులపై ఆయన నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. అనంతరం ఆయన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తోపాటు కేంద్ర మంత్రి పి.చిదంబరం, రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీని విడివిడిగా కలిసి తాజా రాజకీయ పరిస్థితిని వివరించినట్టు సమాచారం.  రాష్ట్రపతి ఎన్నికల అనంతరం అన్ని నివేదికలను ఆమూలాగ్రం చదివిన అనంతరం తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని యూపీఏ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గత రెండు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో టీకాంగ్రెస్‌ ఎంపీలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిదంబరంతో భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సాధించాలన్న తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం అతి త్వరలోనే సాకారం కానున్నదని చెప్పడం ఇక్కడ గమనార్హం.