తెలంగాణ కోసం విద్యార్థులు మంజీరా నదిలో జలదీక్ష

అరెస్ట్‌ చేసిన పోలీసులు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): తెలంగాణ కోసం తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్నంగా నిరసనకు దిగారు. మధ్యప్రదేశ్‌, కూలంకుళం తరహాలో మంజీరా నదిలో దిగి ఆదివారం జలదీక్షకు పూనుకున్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటిస్తేనే బయటకు వస్తామని, లేకుంటే జల సమాధికైనా సిద్ధమని భీష్మించుకు కూర్చున్నారు. విద్యార్థులు చేసిన తెలంగాణ అనుకూల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. ఈ విద్యార్థులు మాట్లా డుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం వెయ్యి మంది ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతున్నదని అన్నారు. పిడికెడు సీమాంధ్ర పెట్టుబడిదారుల కోసం కేంద్రం రాష్ట్రాన్ని ప్రకటించకుండా తాత్సారం చేస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ కోసం ఇంత మంది చనిపోయారు.. సమైక్యాంధ్ర కోసం ఒక్కరు కూడా చావలేదని, అలాంటప్పుడు సీమాంధ్రులు కూడా రాష్ట్ర విభజనను కోరుకుంటున్నట్లు కాదా అని వారు ప్రశ్నించారు. తెలంగాణ అమరుల త్యాగాలతో పోల్చితే, తమ ప్రాణాలు తమకు ఏ మాత్రం లెక్క కాదని, అందుకే జలదీక్షకు పూనుకున్నామని తెలిపారు. ఈ నిరసనలో తమ ప్రాణాలు పోయినా ఫర్వాలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే చాలు అని స్పష్టం చేశారు. విద్యార్థులు జలదీక్షకు దిగారన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దీక్షను భగ్నం చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు తీవ్రంగా ప్రతిఘటించారు. అయినా, పోలీసులు బలవంతంగా విద్యార్థులను నది నుంచి బయటకు తీసుకువచ్చి, అరెస్టు చేశారు. ఈ దీక్షలో సుమారు 70 మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు.