తెలంగాణ పోరులో ప్రతి ముస్లిం షేక్‌ బందగీ కావాలి

దావతే ఇఫ్తార్‌లో కోదండరాం

హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రతి ముస్లిం షేక్‌ బందగీ స్ఫూర్తితో సీమాంధ్రులపై పోరాటం సాగించాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లో జమాతె ఇస్లామీయే హింద్‌ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్‌ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ హైదరాబాద్‌ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక తెలంగాణ ముస్లింలు తీవ్ర వివక్షకు గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్రులు తెలంగాణలో ఉన్న ప్రతి వర్గాన్ని అణగదొక్కారని కోదండారం వివరించారు. గంగా జమునా కీ తహజీబ్‌ అనే నానుడి తెలంగాణలో మాత్రమే ఉన్నదున్నట్లు అమలవుతుందని, సీమాంధ్ర పాలకులు ఈ చరిత్రను భ్రష్ఠు పట్టించడానికి నానా కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. ఎప్పుడు అవకాశం చిక్కినా తెలంగాణలోని వివిధ మతాల మధ్య పొరపొచ్చాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ, సీమాంధ్రులు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు విడిపోరని, ఐక్యంగా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ముస్లింలు చేస్తున్న పోరాటం అభినందనీయమని, వారి పాత్ర తెలంగాణ ఉద్యమ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుందని కోదండరాం ఆశాభావం వ్యక్తం చేశారు. హిందూ ముస్లింల ఐక్యతకు ఇఫ్తార్‌ విందు ప్రతీక అని, అందరూ కలిసికట్టుగా ఉద్యమిస్తే వచ్చే రంజాన్‌ పండుగ తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుందామని తెలిపారు. అనంతరం జమాతె ఇస్లామీయే హింద్‌ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యంలో ఎప్పుడూ ముస్లింలు ముందుండి పోరాడుతున్నారని తెలిపారు. తెలంగాణలో పుట్టిన ప్రతి ముస్లిం ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నాడన్నారు. జేఏసీ చేసే ప్రతి ఉద్యమంలో జమాతె ఇస్లామీయే హింద్‌ తన పూర్తి సహకారాన్ని అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జమాతె ఇస్లామీయే హింద్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆరీఫుద్దీన్‌, రాష్ట్ర నాయకుడు ముజాహిద్‌ లతీఫీ, ఎం.పి.జే. రాష్ట్ర అధ్యక్షుడు ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, టీజీఓల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.