తెలంగాణ మొత్తం ఖుల్లా !

దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలోనైనా.. ఏ జిల్లాలోనైనా.. ఏ మండలంలోనైనా.. ఆఖరికి ఏ గ్రామంలోనైనా ఏదైనా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపాలని నిర్ణయిస్తే, సామాన్య జనజీవనాన్ని స్తంభింప చేసి, తామూ పోటీలో ఉన్నామని, తమ ఉనికిని చాటుకునేందుకు ఏకంగా బంద్‌కు పిలుపునిస్తుంది. ఇలా బంద్‌కు పిలుపునిచ్చిన తర్వాత నిరసన తెలుపుతున్న పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వర్గాలు కొంచెం సేపు బంద్‌ పాటించి, ఆ తర్వాత తమ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగిస్తాయి. సామాన్య జనం మాత్రం ఎందుకొచ్చిన గొడవని బంద్‌లో బలవంతంగానైనా పాల్గొంటాయి. ఇక ఆ పార్టీ మద్దతు వర్గాలు ఎలాగో బైక్‌ ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేస్తూ, నానా హంగామా సృష్టిస్తూ, కొంచెం తెరిచి ఉన్న దుకాణాలను కూడా ‘ఏయ్‌.. బంద్‌ చెయ్‌’ అంటూ గద్దిస్తూ, ఆ రోజు తమదైనట్లు ధూంధాం చేస్తుంటారు. దాదాపుగా మన రాష్ట్రంలో జరిగే బంద్‌ల స్వరూపం కూడా ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఇంకో ముచ్చట కూడా చెప్పుకోవాలి. బంద్‌ ఉందంటే చాలు.. ఎవరు తమ కార్యకలాపాలను నిలిపేసినా, నిలిపేయకున్నా మద్యం దుకాణాలు, పెట్రోల్‌ బంకులు మాత్రం కచ్చితంగా బంద్‌ను పాటిస్తాయి. ఎందుకంటే, బంద్‌ ఇచ్చిన రాజకీయవర్గాలకు ఆవేశమొస్తే ఎక్కడ సీసాలు పగులగొడుతారోనని మద్యం వ్యాపారులకు, ఎక్కడ ఒక్క అగ్గిపుల్ల గీకి పడేస్తారోనని పెట్రోల్‌ బంకు యజమానులకు భయం ఉంటుంది. కనీసం, సాయంత్రం ఐదు గంటల వరకైనా ఈ రెండు వ్యాపారవర్గాలు తమ తమ ‘దుకాణాలు’ మూసి ఉంచుతాయి. కానీ, శుక్రవారం మాత్రం ఇదంతా ఏమీ లేకుండా మన దేశంలో ‘ఓ బంద్‌’ జరిగింది ! అది జరిగిందో జరగలేదో కూడా కనీసం బంద్‌కు పిలుపునిచ్చిన నాయకులు కూడా నిర్ణయించుకోలేని దుస్థితి. ఈ విచిత్ర బంద్‌ జరిగింది మన రాష్ట్రంలోనే. అదీ మన తెలంగాణలోనే. ఈ బంద్‌కు పిలుపునిచ్చింది జగన్‌ పార్టీ. కారణం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం. ఈ కారణం మంచిదే. కానీ, పిలుపునిచ్చిన పార్టీపైనే తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదు. అందుకే, బంద్‌నే బంద్‌ చేశారు. మరి ఇక్కడి విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం తండ్లాడుత లేరా.. అంటే, సెంట్‌ పర్సెంట్‌ వారిలో కూడా నిరుత్సాహం ఉంది. లేనిదల్లా తమ కోసం ఉద్యమిస్తామంటున్న పార్టీపైన భరోసానే. ఎందుకంటే, వైఎస్సార్సీపీని, జగన్‌ను తెలంగాణ ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు నమ్మడానికి ఏ మాత్రం సిద్ధంగా లేరు. గతానుభవాలు వారిని అలా మార్చేశాయి. వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని అధికార పీఠమెక్కి, ఎక్కినంక ఆ సంగతే మరిచి, తాను బతికున్నంత కాలంలో ఆరు వందలకు పైగా తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలను చూసి కూడా, ఇక్కడ ఉద్యమం లేదని కేంద్రానికి నచ్చజెప్పినోడు. లక్షలాది ఎకరాల్లో తెలంగాణ భూములను అప్పనంగా తన కొడుకుతోపాటు తన వాళ్లకు కట్టబెట్టినోడు ఆయన. అలాంటి వాడి కొడుకు జగన్‌. ఇతనేమన్నా తక్కువోడా, ఇతని దోపిడి ఏ పాటిదంటే, ఇతను సాగించిన అక్రమార్జన లెక్కలు చూసుకుంటూ ప్రస్తుతం చంచల్‌గూడలో సేదదీరుతున్నాడు. ఇతను కూడా తిన్నది ‘తెలంగాణ’నే. మరి ఇలాంటి నాయకత్వంలో నడుస్తున్న పార్టీని దోపిడీకి అలవాటు పడ్డ సీమాంధ్రులు నమ్ముతారేమో ! కానీ, తెలంగాణ ప్రజలు ఎట్ల నమ్ముతరు. ఆ పార్టీ ఇచ్చిన బంద్‌కు ఎందుకు మద్దతినిస్తరు. అందుకే, శుక్రవారం వైఎస్సార్సీపీ ఇచ్చిన బంద్‌కు ఏ మాత్రం స్పందించకుండా యావత్‌ తెలంగాణ ఖుల్లనే ఉంది. ఆఖరికి పైన చెప్పుకున్నట్లు వైన్స్‌లు, బంకులు కూడా జగన్‌ మూకకు అదరలేదు.. బెదరలేదు. అందుకే, చెప్తున్నాం.. జగన్‌ పార్టీ అనేది తెలంగాణలో లేనే లేదు. ఇక్కడ ఉన్నది ఒక్కటే పార్టీ అదే ‘తెలంగాణ పార్టీ’. బస్‌ గంతే..!