దళితబంధుపై ఉద్యోగ సంఘాల జెఎసి హర్షం


అంబేడ్కర్‌, కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం
కామారెడ్డి,ఆగస్టు17(జనంసాక్షి): రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు దళిత బంధు పథకాన్ని ఉద్యోగులకు కూడా వర్తింపచేయడం పట్ల కామారెడ్డి జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ హర్షాన్ని ప్రకటించింది. మంగళవారం సవిూకత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా నాన్‌ గజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎన్‌.వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ, దళితులను కడుపులో పెట్టుకొని చూసుకోవాలనే ఆలోచనతో, వారి అభ్యున్నతికి ముఖ్యమంత్రి దళిత బంధు పథకం వర్తింప చేసి 10 లక్షల రూపాయలు అందించడం, అలాగే దళిత బంధు పథకాన్ని దళిత ఉద్యోగులకు కూడా వర్తింప చేస్తామని ప్రకటించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో 42 వేల మంది దళిత ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారిని కూడా పైకి తేవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి దళిత బంధు ఉద్యోగులకు కూడా ప్రకటించడం, దళితుల ఆర్థిక సామాజిక అభివద్ధి కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాలు పూర్తిగా అండగా ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ దయానందరావు, ఎస్‌సి. సంక్షేమ శాఖ అధికారి రజిత, టీజీఓ జిల్లా అధ్యక్షులు దేవేందర్‌, టీఎన్‌జీఓ కార్యదర్శి సాయిలు, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ నాగరాజు, వైస్‌ ప్రెసిడెంట్‌ చక్రధర్‌, దేవేందర్‌, తెలంగాణ గెజిటెడ్‌ ఉద్యోగుల జిల్లా సెక్రటరీ సాయి రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.