మార్చి 31లోగా మూసీ రివర్‌ఫ్రంట్‌ ప్రారంభం

` ఏడాదంతా నీరు నిరంతరంగా ప్రవహించేలా చర్యలు
` నదీ పునరుజ్జీవంతో నగరానికి మహర్దశ
` మూసీ పరివాహకరంలో నైట్‌బజార్‌ల అభివృద్ధి
` నిర్వాసితులకు పక్కా ఇళ్లు కట్టించి ఇస్తాం
` మూసీ పొడువునా ఎలిటెడ్‌ కారిడార్ల నిర్మాణం
` అంతర్జాతీయ కన్సల్టెంట్లతో ప్రణాళికలు
` డిపిఆర్‌ సిద్ధం కాగానే ఎమ్మెల్యేలకు వివరణ
` కొందరు కావాలనే మూసీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
` అసెంబ్లీలో మూసీ అభివృద్దిపై సీఎం రేవంత్‌ వివరణ
హైదరాబాద్‌(జనంసాక్షి): మూసీ పునరుజ్జీవనంతో హైదారబాద్‌ ఖ్యాతిని మరింత పెంచడంతో పాటు, మెరుగైన నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. మూసీ పొడువునా గోదావరి నీటిని పారించి సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఈ క్రమంలో నిర్వాసితులకు పునరావసం కూడా కల్పిస్తామని అన్నారు. నిజాం ఎంతో ముందుచూపుతో మూసీ పొడవునా మంచి కట్టడాలు కట్టి ఆదర్శంగా నిలిచారని అన్నారు. నిజాంలు నిర్మించిన ప్రాజెక్టులే హైదరాబాద్‌ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని అన్నారు. గతంలో జలవనరులను కాపాడుకొనే ప్రయత్నాలు జరగలేదని విమర్శించారు. మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీలో జరగిని చర్చలో సీఎం మాట్లాడారు. గతంలో జల వనరులను కలుషితం చేశారు. కబ్జాలతో ఫాంహౌస్‌లు నిర్మించారు. వాటి డ్రైనేజీలను జంట జలాశయాలకు కలిపారు. నిందితులపై ఉక్కుపాదం మోపాం. డ్రైనేజీలను కూలగొట్టాం. కాకతీయుల నుంచి నిజాం వరకు నదీ పరివాహకంలోనే ప్రాజెక్టులు చేపట్టారు. వరద ముంపు నుంచి నగరాన్ని రక్షించేందుకు 1922 నాటికి ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ ప్రాజెక్టులు చేపట్టారు. ప్రపంచ దేశాలతో హైదరాబాద్‌ పోటీపడేలా నగరాన్ని నిజాంలు తీర్చిదిద్దారు. వారు చేసిన అభివృద్ధిని గత పాలకులు కనుమరుగు చేశారు. నదులను కలుషితం చేసి నివాసయోగ్యం కాని ప్రాంతాలుగా మార్చారు. నగరంలోని మురుగుకాల్వలను మూసీకి కలిపారు. ఇలా కలుషితం చేయడంతో నల్గొండ జిల్లాలోని మూసీ పరివాహక ప్రజలు జీవించలేని దుర్భర పరిస్థితి నెలకొంది. ఆ పరిస్థితి నుంచి కాపాడాలని వేలాది మంది విజ్ఞప్తి చేశారని సిఎం తెలిపారు. ఈ నేపథ్యంలో మూసీ సుందరీకరణపై అధ్యయనం చేశాం. ఏడాదంతా నదిలో నీళ్లు ప్రవహించేలా ప్రణాళికలు రూపొందించాం. మూసీ ప్రక్షాళనకు కన్‌స్టలెంట్‌ కోసం గ్లోబల్‌ టెండర్లు పిలిచాం. 3 సంస్థలు జాయింట్‌ వెంచర్‌ కింద మూసీ పునరుద్ధరణ పనులు చేపట్టాయి. గోదావరి నుంచి 20 టీఎంసీల నీరు నగరానికి తరలించాలనే ప్రణాళిక ఉందని, అందులో ప్రజల దాహార్తిని తీర్చేందుకు 15 టీఎంసీలు, గండిపేటకు మరో 5 టీఎంసీలు తరలించేలా ఆలోచిస్తున్నామని వివరించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో సుందరీకరణపై లండన్‌, జపాన్‌, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్‌లలో అధ్యయనం చేశాం. ప్రపంచస్థాయి నగరాల్లో నదీ పరివాహక ప్రాంతాలను కాపాడుకొని వ్యాపార కేంద్రాలుగా మార్చారు. ఆర్థికవ్యవస్థ బలోపేతానికి ఆయా దేశాలు పోటీపడుతున్నాయి. గుజరాత్‌లో సబర్మతి నది అభివృద్ధి కోసం 60వేల కుటుంబాలను తరలించారు. యూపీలో గంగా నదిని ప్రక్షాళన చేసి రివర్‌ఫ్రంట్‌ ఏర్పాటు చేశారు. ఆ అభివృద్ధిని భాజపా ఎన్నికల అజెండాగా మార్చారు. ఆయా రాష్టాల్ల్రో నదుల ప్రక్షాళనను వ్యతిరేకించడం లేదని రేవంత్‌ వివరించారు. కొందరు కడుపులో విషం తగ్గించుకుంటే మంచిదని విపక్ష పార్టీలోని పలువురు కీలక నేతలకు సీఎం రేవంత్‌ రెడ్డి హితవు పలికారు. మూసీ కాలుష్యం కంటే కొందరు మనుషుల కడుపులో ఉన్న విషం అత్యంత ప్రమాదకరమన్నారు. తాను వివరాలు చెబుతుంటే ఎందుకు విషం కక్కుతున్నారంటూ విపక్ష సభ్యులను ఆయన సూటిగా నిలదీశారు. ప్రజలకు నిజాలు తెలియవద్దని చర్చ జరగకుండా చూడాలనుకుంటున్నారా? అని వారిని ప్రశ్నించారు. వివరాలు చెబుతుంటే నొప్పి ఎందుకు విూకు అంటూ
విపక్ష సభ్యులపై ఆయన మండిపడ్డారు. మూసీకి అడ్డంగా పడుకుంటామంటున్న వారు..మొన్న వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడికిపోయారంటూ వారిని సీఎం రేవంత్‌ రెడ్డి కడిగేశారు. కొంతమంది తనను రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ అంటున్నారని.. రియల్‌ ఎస్టేట్‌ సైతం ఒక ఇండస్ట్రీనే అని ఆయన వివరించారు. హైటెక్‌ సిటీ నిర్మించాలనుకున్నప్పుడు కూడా ఇలాంటి విమర్శలే చేశారని పేర్కొన్నారు. రోజు రోజుకు పట్టణీకరణ పెరుగుతుందని చెప్పారు. రాబోయే 20 ఏండ్లలో 75 శాతానికి పట్టణీకరణ పెరుగుతుందని తెలిపారు. తెలంగాణలో మూసీ నది 240 కిలోవిూటర్లు ప్రవహిస్తుందన్నారు. అనంతగిరి హిల్స్‌ నుంచి వాడపల్లి వరకు మూసీ ప్రవాహం ఉందన్నారు. మూసీ, ఈసీ నదులు కలిసే చోటు బాపుఘాట్‌ నిర్మిస్తామని.. అందుకే అక్కడ గాంధీసరోవర్‌ ప్రాజెక్ట్‌ చేపట్టామని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలోనే అభివృద్ధి జరుగు తుందని పేర్కొన్నారు. మూసీ నది ప్రక్షాళనను మొదట 21 కిలోవిూటర్లు చేయాలని చూస్తున్నామని.. హిమాయత్‌సాగర్‌ నుంచి గాంధీ సరోవర్‌ వరకు అభివృద్ధి చేస్తామని చెప్పారు. మార్చిలో తొలి దశ పనులు ప్రారంభిస్తామన్నారు. సంక్రాంతిలోగా తొలి దశ డీపీఆర్‌పై క్లారిటీ ఇస్తామని పేర్కొన్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 51 కి.విూ మూసీ అభివృద్ధి చేస్తామని వివరించారు. 51 కి.విూ ఎలివేటెడ్‌ కారిడార్లు నిర్మిస్తామన్నారు. విూరాలం ట్యాంక్‌ కూడా మూసీ అభివృద్ధిలో భాగమేనని స్పష్టం చేశారు. ఈ ట్యాంక్‌పై రూ.450 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తున్నామని సీఎం రేవంత్‌ చెప్పారు. నదులు కలుషితం చేసి నివాసయోగ్యం కాని ప్రాంతాలుగా చేశారని మండిపడ్డారు. నదీ పరివాహక ప్రాంతాల నిర్వాసితులకు ప్రత్యామ్నాయం కోరామని చెప్పారు. మూసీ నది కలుషితం కారణంగా నల్లగొండ జిల్లాలో ప్రజలు జీవించలేని పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీటి నుంచి కాపాడాలని వేలాదిగా విజ్ఞప్తులు వచ్చాయన్నారు. ఏడాదంతా మూసీలో నీళ్లు ప్రవహించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. మూసీ పరివాహాక ప్రాంతంలో ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చి నిర్మిస్తామని తెలిపారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని స్పష్టం చేశారు. వచ్చే మూడు నెలల్లో అంచనాలు ఫైనల్‌ చేస్తామని ప్రకటించారు. ఏడీబీ బ్యాంకు రూ.4,100 కోట్ల రుణం ఇస్తుందన్నారు. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. డిపిఆర్‌ పూర్తయ్యాక అసెంబ్లీలో చర్చిస్తామని, సభ్యుల సూచనలు కూడా స్వీకరిస్తామని అన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ రెడ్డి కీలక సూచన చేశారు. విూ నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి కావాలో చెప్పాలని సూచించారు. పేదలకు మంచి ఇళ్లు కట్టించి వారికి మెరుగైన వసతులు కల్పిద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనేదే తమ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. తాము మంచి పని చేయాలనుకుంటున్నాం? విూ సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు. డీపీఆర్‌ సిద్దమయ్యాక ఎమ్మెల్యేలందరికీ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చి సలహాలు తీసుకుంటామని గ్రేటర్‌ పరిధిలోని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

 

‘వీబీ జీ ` రామ్‌ జీ’ను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం
హైదరాబాద్‌(జనంసాక్షి): మహాత్మాగాంధీ జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘వికసిత్‌ భారత్‌` గ్యారెంటీ ఫర్‌ గ్రావిూణ్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌ చట్టం’ (వీబీ జీ రామ్‌ జీ) తీసుకొచ్చింది. దానిని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. అత్యంత పేదల కోసం ఉపాధి హావిూ చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపనుంది.

 

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నాం
` బీఏసీ నిర్ణయాలకు విరుద్ధంగా సమావేశాల నిర్వహిస్తున్నారు. హరీశ్‌రావు
హైదరాబాద్‌,జనవరి2(జనంసాక్షి):అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు, స్పీకర్‌ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. శాసనసభ నుంచి వాకౌట్‌ చేసిన అనంతరం గన్‌పార్క్‌ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి హరీశ్‌రావు నిరసన తెలిపారు. అనంతరం విూడియాతో ఆయన మాట్లాడారు. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి బయటకు వచ్చాం. ప్రజాస్వామ్య విలువలకు అధికార పక్షం పూర్తిగా తిలోదకాలు ఇచ్చింది. బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా సభ నిర్వహిస్తున్నారు. సభను సీఎం రేవంత్‌ బూతుల మయం చేశారు. ఆయన వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు ప్రధాన ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇవ్వలేదు. సీఎంను విమర్శించవద్దని స్పీకర్‌ అంటే ఎలా? ప్రధానిని రాహుల్‌గాంధీ విమర్శించడం లేదా? మూసీ కంటే ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాలి. అసెంబ్లీని గాంధీభవన్‌, సీఎల్పీ సమావేశంలా రేవంత్‌ మారుస్తున్నారు. మేం ప్రశ్నిస్తే అడ్డగోలుగా చిల్లర మాటలు మాట్లాడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. ఈ క్రమంలో నేటి అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయం తీసుకుంది. రేపటి సభకు హాజరు కావొద్దని పేర్కొన్నారు. శనివారం ఉదయం తెలంగాణ భవన్‌ లో కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనుంది. బీఏసీలో మాట్లాడిన మాటలు, తీసుకున్న నిర్ణయాలు వేరు అసెంబ్లీలో పెట్టినవి వేరు.. బీఏసీలో తీసుకున్న నిర్ణయాలు పెట్టకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మూసీకి సంబంధించి కొన్ని ప్రశ్నలను సభలో సందించాం.. వాటిపై సమాధానాలు ఇవ్వకుండా సీఎం మాట్లాడుతున్నారు.. అసెంబ్లీని సీఎం బూతులమయం చేశాడని ఎద్దేవా చేశారు. ఇలా మాట్లాడిన స్పీకర్‌ ఆయనకి అడ్డు చెప్పలేదు.. బీఆర్‌ఎస్‌ కి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఇక సభకు ఎందుకు రావాలని హరీష్‌ రావు ప్రశ్నించారు. మల్లన్న సాగర్‌ నుంచే నీరు తెస్తున్నారా అని అడిగాం.. మూసీ ప్రక్షాళనకు నడుము బిగించిందే బీఆర్‌ఎస్‌.. బాడీ షేమింగ్‌ కు ముఖ్యమంత్రి పాల్పడుతున్నారు.. రౌడీషీటర్స్‌ ఇంకా మంచిగా మాట్లాడుతారని హరీష్‌ రావు అన్నారు. ఇక, కేసీఆర్‌ పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్‌ రావు పేర్కొన్నారు. మైక్‌ ఇవ్వకుండా శాసనసభలో కూర్చోవడం వెస్ట్‌.. స్పీకర్‌ పక్షపాత వైఖరికి నిరసనగా ఈ సెషన్‌ ను బీఆర్‌ఎస్‌ పార్టీ బహిష్కరిస్తుంది.. సభలో అందరికీ సమాన హక్కులు ఉండాలి.. సీఎం అడ్డగోలుగా మాట్లాడితే స్పీకర్‌ అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదని మాజీ మంత్రి హరీష్‌ రావు ఎద్దేవా చేశారు.

ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు
` నెలాఖరులో నోటిఫికేషన్‌కు అవకాశం
` మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ వెల్లడి
హైదరాబాద్‌(జనంసాక్షి): ఈ నెలాఖరు కల్లా మున్సిపాలిటీల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని మున్సిపల్‌ ఎన్నికలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ విూడియా పాయింట్‌లో చిట్‌చాట్‌ చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌. గత రెండు సంవత్సరాలుగా బీఆర్‌ఎస్‌ నేతల వ్యవహార శైలి చూస్తున్నామని.. వారి పంతం నెగ్గించుకోవడానికి ఏమైనా చేస్తారని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ముఖం బీఆర్‌ఎస్‌ నేతలకు లేదని ఎద్దేవా చేశారు. తమ తప్పు ఉంటే అసెంబ్లీలో నిరూపించాలని సవాల్‌ విసిరారు. మూసీ అంశంలో బీఆర్‌ఎస్‌ నేతలే రన్నింగ్‌ కామెంటరీ చేశారని ప్రస్తావించారు. బీఆర్‌ఎస్‌ ప్రభావం కోల్పోయిందని.. ఉనికి కాపాడుకోవడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.రేగా పథకంపై, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేక బీఆర్‌ఎస్‌ నేతలు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. పేదవారి పథకం గురించి బీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టళ్ల విద్యార్థులకు వేడి నీటిని అందించడానికి సోలార్‌ పవర్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామని అన్నారు. ఇందుకోసం అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. కేసీఆర్‌ హయాంలో ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో కనీసం గౌరవం ఇవ్వలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.