దళితులంతా తరలి రావాలి
టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ ఛైర్మన్ రవిశంకర్
హైదరాబాద్,ఆగస్ట్29(జనం సాక్షి): దళితుల అభ్యున్నతకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పెద్దపీటవేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి తాజాగా 101 యూనిట్ల వరకు గృహ వినియోగానికి కరెంట్ వాడుకునే దళిత, గిరిజనుల బిల్లును డిస్కంలకు ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. వీరంతా ప్రగతినివేదన సభకు తరలి రావాలన్నారు. తమ సత్తా చాటాలన్నారు. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం దళితులు, గిరిజనుల సంక్షేమానికి బంగారు బాటలు వేస్తుందని అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న టీఆర్‌ఎస్ సర్కారుకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మున్ముందు మరింత న్యాయం జరుగుతుందని అభిలషించారు.ఇన్నాళ్లు 50 యూనిట్లు వాడుకున్న దళిత, గిరిజనులకు మాత్రమే ఉచిత విద్యుత్తును వాడుకునే వారికే ఉచిత విద్యుత్తుఇచ్చే వారని, ఈ యూనిట్లను 101 కి పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని రవిశంకర్ అన్నారు. ప్రతి ఇంటిలో టీవీలు ఉన్నందునా 50 యూనిట్ల కంటే అధికంగా విద్యుత్తు వాడకం జరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఎకరం స్థలంలో అంబేద్కర్ భవనాన్ని నిర్మించేందుకు రూ. కోటి కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారని అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు ఇదే విధంగా హైదరాబాద్‌లో భవనాల నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో దళితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన వివరించారు. దళితులకు మూడు ఎకరాల వ్యవసాయ భూములు కూడా కొని ఇస్తున్నారని, నిరుద్యోగ యువతకు అనేక స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తున్నారని ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సుంకె రవిశంకర్ తెలిపారు.



