‘ధన’స్వామ్యాన్ని ‘అన్నా’యులు ఎట్లెదుర్కుంటారు ?

‘అవినీతి వ్యతిరేక పోరాటం, అక్రమార్కుల గుట్టురట్టు, నల్లధనం వెలికితీత, లోక్‌పాల్‌ బిల్లు’ అనే మహోన్నత ఆశయాలతో భారతదేశ చరిత్రను తిరగరాయడానికి బయలుదేరిన యోధుడు అన్నా హజారే. ‘ఎన్నికల్లో పాల్గొనం, మా జెండా త్రివర్ణ పతాకం, మా నినాదం సుజలాం.. సఫలాం, మా అజెండా.. మా పోరాటం పటిష్ఠ లోక్‌పాల్‌ బిల్లు కోసమే, మాది ఏ పార్టీ కాదు, మేమే పార్టీకి మద్దతివ్వం, ప్రజలే మా పార్టీ, మేము ప్రజలపక్షం, ప్రజా సంక్షేమం కోసమే మా ఉద్యమం, అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం’ అన్న నినాదాలతో గర్జించి నూట ఇరవై కోట్ల మందికి ఆ ఆరు పదుల సమాజ సేవకుడు సేనానిగా ముందుండి నడిపించాడు. పక్కా గాంధేయవాదైన అన్నా హజారే ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని పలు దఫాలుగా శాంతియుత మార్గంలోనే నిర్వహించారు. మొదటిసారి ఆయన నినదించి దీక్షకు పూనుకున్నప్పుడు సాక్షాత్‌ దేశ ప్రధాని దిగివచ్చి తన దూత ద్వారా డిమాండ్లను నెరవేరుస్తామని హామీ పత్రం పంపేదాకా వెనుదిరగని ధీశాలి అన్నా. కానీ, ఆ తర్వాత ఆ హామీల్లో లొసుగులున్నాయని మలిదశ ఉద్యమానికి అన్నా తెరదీశారు. కార్పొరేట్‌ జీవితాలకు అలవాటు పడి దేశం గురించే మరిచిపోయిన భారత యువత చేత స్వాతంత్య్రం వచ్చిన అరవై ఐదేళ్ల తర్వాత జాతీయ జెండా పట్టించిన ఘనత ఆయన దక్కింది. కారణాలేవైనా, అన్నా హజారే మొదటి దఫా చేపట్టిన ఉద్యమానికి వచ్చినంత స్పందన ఆ తరువాత చేసిన దీక్షలకు రాలేదు. దీని వెనుక కుట్ర కూడా ఉందన్న వాస్తవం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పైన చెప్పుకున్న అన్నా నినాదాల్లో ఏదీ వెనక్కు తగ్గకపోయినా, కేవలం పార్టీ విషయంలో అన్నా రాజీ పడ్డారా ? లేక ఆయనపై ఎవరైనా ఒత్తిడి తెచ్చారా ? శుక్రవారం అన్నా దీక్ష విరమించాక ఆయన అనుంగు అనుచరుడు కేజ్రీవాల్‌ ఎవరూ ఊహించని విధంగా ఓ సంచలనాత్మక ప్రకటన చేశారు. అదే తాము పార్టీ పెడుతున్నట్లు. దీనిపై అన్నా హజారే స్పందిస్తూ నేను ఎన్నికల్లో పోటీ చేయను, కానీ, నా అనుచరులు పెట్టిన పార్టీకి మద్దతు మాత్రం ఇస్తామన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు, ఎన్నికల్లో పోటీ చెయ్యొచ్చు. కానీ, భారత ప్రజలకు పార్టీలపై, పార్టీ నాయకులపై ఏనాడో నమ్మకం సన్నగిల్లిపోయింది. రాజకీయ నాయకులు చేసిన హామీలు మరువడం, దేశంలో కుంభకోణాలు కుంభవృష్టి విరుచుకు పడుతుండడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో అన్నా హజారే అనుయాయులు పెట్టబోయే పార్టీని ప్రజలు నమ్మే అవకాశాలు అంతంత మాత్రమే. మొన్నటి వరకు ఏ పార్టీతో సంబంధం లేకుండా ఉద్యమిస్తున్నందునే దేశ ప్రజలు అన్నా బృందం వెంట నడిచారు. పార్టీ పెట్టాక కూడా అదే విధంగా మద్దతు తెలుపుతారనుకోవడం అతిశయోక్తే అవుతుందేమో ! ఇదిలా ఉంటే, అన్నా అనుచరుడు కేజ్రీవాల్‌ ప్రకటించినట్లు పార్టీ పెట్టారే అనుకుందాం. ఆ పార్టీ అజెండా ఏమై ఉంటుంది ? ‘సుసంపన్న పాలనను అందిస్తాం.. లేదా సమస్యలపై పోరాడుతాం..’ అనే కదా ! ఇదే అజెండాతో ఇప్పటి వరకు పుట్టుకొచ్చిన ఎంత వరకు ‘సుపరిపాలన’ను అందించాయో తెలియనిది కాదు. అదేమి కాకుండా, ప్రజలు పార్టీ అజెండాను నమ్మినా ఆ తరువాత ఓట్లు రాబట్టడం కత్తి మీద సామే. ఎందుకంటే, నేడు ఓట్లు రాల్చుకోవడానికి ఆయా పార్టీలు ఏఏ ‘మాయలు’ చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. విచ్చవిడిగా డబ్బులు పంచడం, పీకల దాకా తాగించడం, అవసరమైతే ‘అన్నీ ఫ్రీ’ అంటూ అమలుకు సాధ్యంకాని హామీలు ఇవ్వడం అన్నా బృందానికి సాధ్యమవుతుందా ? ఒకవేళ సాధ్యమైతే మిగతా పార్టీలకు అన్నా బృంద పార్టీకి తేడా లేకుండా పోతుంది. ప్రజలు యథావిధిగా ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోతారు. ఇన్ని బాలారిష్టాల మధ్య అన్నా అనుచరులు పార్టీని ఎలా నడుపుతారో, దేశంలో ప్రజాస్వామ్యానికి బదులు కొనసాగుతున్న ‘ధన’స్వామ్యాన్ని ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి !