నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించిన మంత్రి కేటీఆర్
, సెప్టెంబర్ 6(జనంసాక్షి):హైదరాబాద్
హైదరాబాద్లో జరగనున్న ఫార్ములా-ఈ నిర్వహణను సైతం మంత్రి కేటీఆర్ సమీక్షించారు
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ పురపాలక శాఖ ఉన్నత అధికారులతో చేపట్టిన ఈ సమీక్ష అమీర్పేటలోని హెచ్ఎండిఏ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వివిధ పురపాలక విభాగాల అద్వర్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న రోడ్డు నిర్వహణ మరియు నిర్మాణ కార్యక్రమాలపైన అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం మరియు సిఆర్ఎంపీ కార్యక్రమాల్లో భాగంగా కొనసాగుతున్న కార్యక్రమాల పైన అధికారులు మంత్రికి వివరాలు అందించారు. సి ఆర్ ఎం పీ కార్యక్రమం ద్వారా నిరంతరం నగరంలోని ప్రధాన రహదారుల నిర్వహణ కొనసాగిస్తున్నందు, వాటి ఫలితాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు నిర్వహణతో పాటు రోడ్డుకు అనుబంధంగా ఉన్న పుట్ పాత్, జంక్షన్ల అభివృద్ధి, నిర్వహణ వంటి అంశాల పైన మరింత దృష్టి సారించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే దేశంలో వివిధ నగరాల్లో మాడల్(అదర్శ) రోడ్డు నిర్వహణ కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని జనాగ్రహ వంటి సంస్థల ఆధ్వర్యంలో జంక్షన్ల సుందరీకరణ, అభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపట్టామని, ఆయా కార్యక్రమాలు త్వరలోనే పూర్తవుతాయని అధికారులు మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు. నగరంలో చేపట్టిన లింకు రోడ్ల నిర్మాణం సత్ఫలితాలను ఇస్తుందని, మరిన్ని లింక్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి అవసరమైన కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఈ సమీక్ష సమావేశంలో కేటిఆర్, జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు.
వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన పనులు దాదాపుగా పూర్తి అయ్యాయని, ఈసారి భారీగా వర్షాలు కురిసినా, పలు ప్రాంతాలు గతంలో మాదిరి నీట మునిగిపోకుండా వ్యూహాత్మక అభివృద్ధి కార్యక్రమం ఎంతగానో సహాయ పడిన విషయాన్ని మంత్రి కేటీఆర్ కి అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో పనుల పురోగతిని, పూర్తయిన నలాల నిర్మాణానికి సంబంధించి వివరాలను విస్తృతంగా జనబాహుళ్యంలోకి తీసుకుపోవాలని కేటీఆర్ అధికారులను కోరారు.
హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఫార్ములా ఈ రేసు కి సంబంధించి మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో సమీక్షించారు. ఫార్ములా ఈ కోసం అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ఫార్ములా నిర్వాహకులతో పాటు, పురపాలకశాఖ హెచ్ఎండీఏ అధికారులు సమన్వయంతో ముందుకుపోతున్నారని, ఫార్ములా ఈ రేసుని, విజయవంతంగా పూర్తి చేస్తామ్న విశ్వాసాన్ని అధికారులు వ్యక్తం చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ మరియు ఇతర పురపాలక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.