నినదిస్తే బెదిరిస్తరా ?

ఒకే ఆకాంక్ష తెలంగాణలోని నాలుగున్న కోట్ల మందిని ఒక్కటి చేసింది. నిత్యం ఆ ఆశే శ్యాసగా తెలంగాణ ప్రజలు జీవిస్తున్నరు. తమ చిరకాల కోరిక తెలంగాణ రాష్ట్ర సాధనను కళ్లారా చూడాలని వేల కళ్లతో ఎదురు చూస్తున్నరు. తమ న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చాలని పాలకులను అడుగుతున్నరు. నినదిస్తున్నరు. నిలదీస్తున్నరు. త్యాగాలు చేస్తున్నరు. ఉద్యమిస్తున్నరు. తమ వాంఛను ఢిల్లీలో వినిపించాలని ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, ఎప్పుడైనా చల్లబడితే, వారిలో నూతనోత్సాహం నింపుతున్నరు. కదనానికి కాలు దువ్వేలా సిద్ధం చేస్తున్నరు. ”ఎప్పుడిస్తరు తెలంగాణ.. ఎప్పుడు తెస్తరు తెలంగాణ” అంటూ తమ ప్రజాప్రతినిధులపై అడుగడుగునా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నరు. 2004లో కూడా అదే హామీ ఇవ్వడం వల్ల వైఎస్‌ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో అధికారం కట్టబెట్టారు. అదే సమయంలో సోనియమ్మ కూడా కరీంనగర్‌కు విచ్చేసి ‘మీ కోరికేమిటో నాకు తెలుసు’ అని అనగానే ఆ ‘అమ్మ’ అధికారంలోకి రాగానే తెలంగాణ ఇస్తుందని సంబుర పడ్డరు. ఆమె వెనుకాలే ఉన్న వైఎస్‌ఆర్‌ కూడా తలాడించడంతో అవలీలగా వాళ్లు గద్దెనెక్కేలా ఆశీర్వదించారు. నాటి నుండి నేటి వరకు తెలంగాణ ప్రజలు ఏ లక్ష్యంతో ప్రస్తుత పాలకులను ఎన్నుకున్నారో ఆ లక్ష్యాన్ని ఎన్నిక కాబడ్డ వాళ్లు నిర్లక్ష్యం చేస్తూనే వస్తున్నారు. తెలంగాణ అంశం ఎప్పుడు తెర మీదికి వచ్చినా, సహనం నశించి తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ఉధృతమైనా పాలకులు మాత్రం అప్పటి మందం ఉద్యమ ఉధృతిని చల్లబర్చేందుకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వాయిదాలు వేస్తూనే ఉన్నారు. ‘ఇది సందర్భం కాదు.. ఇదయిపోనీ చెబుతాం’ అంటూ ఏదో ఒక అంశాన్ని సాకుగా చూపుతున్నారు. ఇన్నేళ్ల కాలంలో పాలకులు చూపిన సాకులకు లెక్కే లేదు. మచ్చుకు చెప్పాలంటే 2009 సార్వత్రిక ఎన్నికలు అయ్యాక చెబుతామన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసమే చాలాసార్లు ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికలు కానివ్వండన్నారు. దసరా, సంక్రాంతి, రంజాన్‌, బక్రీద్‌ లాంటి పండుగలను కూడా సాకుగా వాడుకుని, పండుగల తర్వాత చెబుతామన్నారు. ఏడాదికోసారి ఈ పండుగలు వస్తున్నయ్‌.. పోతున్నయ్‌.. మళ్లీ వస్తున్నయ్‌.. కానీ, ఆ పండుగల తర్వాత వెలువడుతుందనుకుంటున్న తెలంగాణ ఏర్పాటుపై సానుకూల ప్రకటన మాత్రం పాలకుల నోట వెల్లడవడం లేదు. అంతెందుకు, పోయినేడాది కూడా బక్రీద్‌ కానివ్వండి అన్నారు. ఇప్పుడు రంజాన్‌ నడుస్తున్నది. ఇంకో నెలాగితే మళ్లీ బక్రీద్‌ వస్తుంది. ఈ ఏడాది కాలంలోనే పరకాల ఉప ఎన్నిక కానివ్వండన్నారు. అటు తర్వాత రాష్ట్రపతి ఎన్నికలన్నారు. అవీ అయిపోయాయి. మొన్నటికి మొన్న ఉప రాష్ట్రపతి ఎన్నికలు అయ్యాక పక్కాగా చెబుతామన్నారు. ఈ ఎన్నిక తంతు కూడా పూర్తయింది. కానీ, పాలకుల నోట తెలంగాణ ఊసే లేదు. ‘రేపు మా ఇంట్లో అందరికి విందు భోజనం’ అని ఇంటి ముందు బోర్డు పెట్టి, తెల్లారి విందుకు వచ్చిన వారికి మళ్లీ అదే బోర్డు చూపించాడంట గతంతో ఒక జిత్తులమారి. ప్రస్తుతం పాలకుల వైఖరి కూడా అలాగే ఉంది. ఇదిగో తెలంగాణ.. అదిగో తెలంగాణ అంటూ ఊరిస్తున్నారు తప్పితే స్పష్టమైన ప్రకటనను మాత్రం చేయడం లేదు. దీంతో తెలంగాణ ప్రజలు మళ్లీ తమ ఆయుధాలుగా తమ ప్రజాప్రతినిధులనే ఎన్నుకున్నారు. కాంగ్రెస్‌కే చెందిన ఎంపీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కచ్చితంగా గళం విప్పాలని స్పష్టం చేసి, ఈ వర్షాకాలపు సమావేశాలకు వారిని సాగనంపారు. వారు కూడా తమ ప్రజాభీష్టం మేరకు సమావేశాల తొలి రోజైన బుధవారం నినదించారు. అంతే, యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఎంపీలడిగిన న్యాయమైన కోరిక వినగానే ఉలిక్కిపడ్డది. ఇంతకు ముందు లాగే ఈసారి కూడా సమావేశాలను తమ పార్టీకే చెందిన ఎంపీలు ఎక్కడ స్తంభింపజేస్తారోనని కాంగ్రెస్‌ పెద్దలకు చెమటలు పట్టాయి. అందుకు, ఏకంగా యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీయే రంగంలోకి దిగింది. నినదిస్తూ ముందు ముందుకొస్తున్న తెలంగాణ ఎంపీలను వారించింది. సభలో నిశ్శబ్ధంగా ఉండాలని, లేకుంటే బయటకు వెళ్లిపోవాలని టీఎంపీల గొంతును తన సైగల ద్వారా నొక్కేసింది. ఒక దశలో ఆ ప్రజాప్రతినిధులను అవమానించినంత పని చేసింది. ఇదేనా ప్రజాస్వామ్యం ? ప్రజలు తమ ప్రతినిధులుగా ఎన్నుకున్న వారితో ఓ పాలకాధినేత్రి వ్యవహారించాల్సిన తీరిదేనా ? ప్రజలు తమ నాయకులను ఎన్నుకునేదే తమ గళాన్ని చట్ట సభల్లో వినిపించాలని అన్న విషయం సోనియాకు తెలియదా ? తెలుసు.. కానీ, దురహంకారం. వీళ్లేం చేస్తారులే అన్న ధీమా. కానీ, ప్రజల్లో ఓ ఆకాంక్ష బలంగా నాటుకుంటే.. ఆ ఆకాంక్ష ధాటికి రాజ్యాలే కూలిపోయిన సందర్భాలు కోకొల్లలు. సోనియా ఎంత ? ముందుంది మొసళ్ల పండుగ ! ఎన్నిసార్లు గొంతు నొక్కితే అంతకు రెట్టింపుగా నినదించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నరు. నినదిస్తే.. బెదిరించే నాయకురాలికి సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెప్పేందుకు సమాయత్తం అవుతున్నరు. అందుకే.. ఇప్పటికైనా కుంటి సాకులు చూపడం, ఈ సమయంలో నినదించాల్సింది కాదని చల్లబర్చే ముచ్చట్లు మాని ప్రత్యేక రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలి. నాలుగున్నర కోట్ల మంది న్యాయమైన డిమాండ్‌ను బేషరతుగా గౌరవించాలి.