నిబంధనల మేరకు విభజన

గుంటూరు, జూలై 25: అర్బన్‌ పోలీసు జిల్లా ఏర్పాటులో భాగంగా సిబ్బంది విభజన విధానంపై గుంటూరు రేంజ్‌ ఐజీ హరీష్‌కుమార్‌గుప్తా తన ఛాంబర్‌లో ఎస్పీలతో సమీక్ష జరిపారు. అర్బన్‌, పోలీసు, రూరల్‌ ఎస్పీలు ఆకే రవికృష్ణ, సత్యనారాయణలతో పాటు అర్బన్‌ ఎఎస్పీ కోటేశ్వరరావు పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బంది విభజన తాజా నిబంధనలకు, సైక్లింగ్‌ విధానంపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. పర్సనల్‌ బదిలీలు కోరుకునే వారి వివరాలు ప్రత్యేకంగా నమోదు చేయాలని నిర్ణయించారు. తాజాగా నిర్ణయించిన సీనియర్టీ జాబితా ఆధారంగా పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని భావించినట్లు సమాచారం. సీనియార్టీ జాబితాను 7:3 నిష్పత్తిలో ప్రతి 10 మందికి ఓ సైకిల్‌గా విభజించాలని యోచిస్తున్నారు. అంతర్జాలంలో పట్టికను విడుదల చేసి నోటీసు బోర్డులో విభజన పట్టికను విడుదల చేసి బదిలీలకు గడువు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. నిర్ణీత గడువులో ఈ ప్రక్రియ ముగించి ఆ జాబితాను త్వరలో అందజేయాలని ఐజి ఆదేశించినట్లు తెలిసింది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలోని పోలీసు స్టేషన్‌ పునర్‌ వ్యవస్థీకరణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఒక శాసనసభ్యులు ఉన్న పరిధి మొత్తం ఒక డిఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షించేందుకు వీలుగా రూపొందించాలని ఐజి ఆదేశించారు. త్వరలో పోలీసుస్టేషన్లను పునర్‌ వ్యవస్థీకరణ చేసి వాటి వివరాలు సమగ్రంగా అందజేయాలని ఆదేశించారు.