అడ్మిషన్ల కోసం ఎదురుచూపు
- వివిధ కోర్సుల్లో
- హాస్టల్ లేదంటూ నిరాకరిస్తున్న ప్రిన్సిపాళ్లు
- డే-స్కాలర్‌గా అయినా వస్తామంటున్న విద్యార్థులు
B.Sc Nursing | హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): బీఎస్సీ నర్సింగ్‌లో అబ్బాయిలకు కూడా అవకాశం ఇవ్వాలని ఉత్తర్వులు ఉన్నా.. దశాబ్దాలుగా అమలు కావడం లేదు. హాస్టల్ లేదన్న కారణంతో అడ్మిషన్లు ఇవ్వడానికి నర్సింగ్ కాలేజీల ప్రిన్సిపాళ్లు నిరాకరిస్తున్నారు. ఏటా బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లకు ముందు ‘ఈ ఏడాది బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో అబ్బాయిలను (మేల్ నర్సింగ్) చేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?’ అని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అడగడం.. ‘హాస్టల్ లేదు కాబట్టి చేర్చుకోము’ అంటూ ప్రిన్సిపాళ్లు సమాధానం ఇవ్వడం 2007 నుంచి ఇదే ఆనవాయితీగా వస్తున్నది. ఎంబీబీఎస్ అడ్మిషన్లకు పచ్చజెండా ఊపేలా గురువారం హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం కాళోజీ యూనివర్సిటీ సిద్ధమవుతున్నది. ఈసారైనా ప్రభుత్వం తమకు బీఎస్సీ నర్సింగ్‌లో అవకాశం ఇవ్వాలని అబ్బాయిలు కోరుతున్నారు. హాస్టళ్లు నిర్మించలేకపోతే నిబంధనలు సవరించి కనీసం డే స్కాలర్‌గా అయినా అవకాశం ఇవ్వాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు, సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు.
రెండు దశాబ్దాలుగా ఎదురుచూపు..
గతంలో బీఎస్సీ నర్సింగ్ కేవలం అమ్మాయిలకు మాత్రమే ఉండగా, 2005లో అబ్బాయిలకు కూడా అవకాశం కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ మేరకు 2006, 2007లో కొందరికి అవకాశం లభించింది. ఆ తర్వాత ఏడాది నుంచి హాస్టళ్లు లేవన్న కారణంతో అడ్మిషన్లను నిరాకరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం దేశ, విదేశాల్లో నర్సులకు మంచి డిమాండ్ ఉన్నది. జీఎన్‌ఎం (డిప్లొమా)లో అబ్బాయిలకు అడ్మిషన్లు ఇస్తున్నా, ఆ సర్టిఫికెట్‌కు పెద్దగా డిమాండ్ లేదు. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేస్తే తమ భవిష్యత్తు బాగుపడుతుందని, ప్రభుత్వం ఈ ఏడాదైనా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. నిబంధనలను మార్చి అమలు చేస్తే డేస్కాలర్‌గా అయినా అవకాశమివ్వాలని కోరుతున్నారు.