మైలవరం ఎర్ర చెరువుకు గండి


గుర్రాజుపాలెం ప్రజలు ఇళ్ళు ఖాళీ చేయాలని దండోరా
విజయవాడ,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :   భారీ వర్షాల కారణంగా మైలవరం ఎర్ర చెరువుకు గండి పడిరది. గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి చెరువు నిండిపోయింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు కలింగం వద్ద చెరువుకు గండి పెట్టి నీరును దిగువకు వదిలి అనంతరం చెరువుకు పడిన గండిని నేతలు పూడుస్తున్నారు. ఎర్ర చెరువు నీటిని దిగువకు విడుదల చేయడంతో జి.కొండూరు మండలం గుర్రాజుపాలెం గ్రామానికి వరద ముప్పు పొంచివుంది. దీంతో గుర్రాజుపాలెం కొత్తూరులోని ప్రజలు ఇళ్ళు ఖాళీ చేయాలని పోలీసులు మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కొత్తూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎర్ర, పంగిడి చెరువులను ఇరిగేషన్‌, పోలీస్‌ అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు మైలవరం నియోజకవర్గంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో డ్రైన్‌లు పొంగి వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. వర్షపు నీరుతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. చండ్రగూడెం మల్లయ్య కుంటకు గండి పడిరది. కొండ వాగు ప్రవాహంతో పొందుగల చౌడు చెరువు కింద వరి పొలాలు నీట మునిగాయి. వెల్వడం వద్ద ప్రమాదకర స్థాయిలో బుడమేరు ప్రవహిస్తోంది. కాగా… ఇటు కృష్ణా జిల్లా గుడివాడ బుడమేరులో వరద ఉధృతి కొనసాగుతోంది. నందివాడ మండలంలో బుడమేరు పరివాహక గ్రామాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరాయి. స్పీడ్‌ బోట్ల సహాయంతో ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. పంట పొలాలు, చేపల చెరువులు బుడమేరు వరద నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.