మహిళ పట్ల ఓ ఏసీపీ అసభ్య ప్రవర్తన..?
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) : ఆయన పోలీస్ శాఖలో ఉన్నతాధికారి.. తమకు కష్టం వచ్చిందని ఎవరైనా వస్తే వారికి అండగా నిలవాల్సిన బాధ్యత అతనిపై ఉంది. ముఖ్యంగా సమాజంలో మహిళలపై పెరుగుతున్న నేరాలను అరికట్టడంలో ముందుండాల్సిన గురుతర బాధ్యత ఆయన భుజస్కంధాలపై ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.. అయితే అధికారి బుద్ధి గడ్డి తిన్నది. మహిళల మాన, ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన ఆ అధికారి ఎవరూ లేని సమయం చూసి తన ఇంట్లో పనిచేసే మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.. ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న ఆయన వయసు చేయాల్సిన పని ఇది కాదు.. అయినా వయస్సును సైతం పట్టించుకోకుండా తన కామ క్రీడా విన్యాసాన్ని ప్రదర్శించేందుకు ఆయన చూపిన చొరవ విధి నిర్వహణ పట్ల చూపినట్లయితే ఎంతోమంది అభాగ్యులకు న్యాయం చేసేవాడు. ఇలా పదిమందిలో అల్లరి పాలయ్యేవాడు కాదు. ఇది ఏమైనా రక్షించాల్సిన అధికారే భక్షించేందుకు తెగబడటం చూస్తుంటే ఇక మహిళ ల మానప్రాణాలకు దిక్కెవరనే ప్రశ్నలను ఖమ్మం నగర ప్రజలు సంధిస్తున్నారు. ఈ ఘటన వైరల్ కావడంతో ఆ అధికారిని నగర ప్రజలు చీదరించుకుంటున్నారు. ఈ ఘటనపై జిల్లా పోలీస్ బాస్ దృష్టి సారించి శాఖపరమైన విచారణ నిర్వహించి మహిళ లోకానికి భరోసా ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది.