తెలంగాణ ఆకాంక్షలకు అద్దంపడుతున్న ‘హైడ్రా’
` ఉద్యమకాలం నాటి ఎజెండా అమలుపరుస్తున్న రేవంత్ సర్కార్
` సర్కారు జాగాల్లో పాగావేసిన అక్రమార్కులపై ఉక్కుపాదం
` నాడు గురుకుల్ ట్రస్ట్ భూములు, ల్యాంకోహిల్స్‌లోనూ చర్యలు
` ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కూడా అప్పటి ఎజెండాలో భాగమే..
` ముఖ్యమంత్రి రేవంత్ పాలనకు ప్రతిపక్షాలు కూడా నీరాజనలు
సీమాంధ్ర పాలకుల చేతుల్లో నలిగిపోయిన చెరువులు ఒక్కొక్కటిగా మళ్లీ ఊపిరి పీల్చుకుంటున్నాయ్. కబ్జాకోరుల చేతుల్లో ‘చిన్నబోయిన’ సర్కారు భూములు తిరిగి అక్రమార్కుల చెరనుంచి విముక్తి పొందుతున్నాయ్. పాలకుల అడ్డగోలుతనంలో వెలిసిన ‘గోడలు’ పేకమేడల్లా పడిపోతున్నాయ్..! ఈ ‘మార్పు’ భూమాఫియా కంటిమీద కునుకులేకుండా చేస్తుండగా.. ప్రజాపాలన పట్ల ప్రతిపక్ష నేతలు, విమర్శకులు సైతం సానుకూల దృక్పథం ప్రదర్శించడం తెలంగాణ రాజకీయాల్లో నవశకానికి నాంది పలుకుతోంది. దశాబ్దాలుగా ప్రజలకు సంబంధించిన ఆస్తులను అప్పనంగా కాజేసిన భూబకాసురుల భరతం పట్టడం తెలంగాణ ఆకాంక్షలకు అద్దంపడుతోంది. గత పదేళ్లలో అమలుకాని నాటి ఎజెండా ‘హైడ్రా’ రూపంలో పకడ్బందీగా అమలుపరచడం రేవంత్ సర్కార్ ఘనతగా మిగిలిపోనుంది.
హైదరాబాద్ కరస్పాండెంట్ (జనంసాక్షి) :నీళ్లూ, నిధులు, నియామకాలతో పాటు ప్రజల సంపదైన ప్రభుత్వ భూములు, వాటి పరిరక్షణ తెలంగాణ ఉద్యమంలో భాగమే. రాష్ట్ర ఏర్పాటుకు ముందు అప్పటి పాలకులు, అధికారుల కనుసన్నల్లో కనుమరుగైన కుంటలు, చెరువులు, పార్కులకు విముక్తి కల్పించాలని ఉద్యమ సారథి కేసీఆర్ సైతం ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం తొలి ప్రభుత్వంలో గురుకుల్ ట్రస్ట్ భూముల్లో కూల్చివేతల పర్వం మొదలైంది. ల్యాంకోహిల్స్ భూముల స్వాధీనం విషయంలోనూ సుప్రీం కోర్టు తీర్పు అనుకూలించింది. ఈ క్రమంలోనే బహుళ అంతస్తుల విషయంలో కేసీఆర్ సర్కారు ఉక్కుపాదం మోపుతుందని భావించారు. అనుకున్నట్టుగానే పదుల సంఖ్యల్లో భారీ భవనాలు కూల్చి, కొద్దికాలంలోనే ఆ ప్రక్రియను నిలిపివేశారు. ఉద్యమ కాలం నాటి ఎజెండా అంశాల్లో ఒకటైన ప్రభుత్వ భూముల పరిరక్షణ, సర్కారు ఆస్తుల స్వాధీనం సైలెంట్‌గా మారింది. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి సర్కారు నేతృత్వంలో ఎన్ కన్వెన్షన్ కూల్చడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చకు దారితీసింది. చెరువు పక్కన బఫర్‌జోన్‌ను కబళిస్తూ కట్టిన ఆ నిర్మాణాన్ని ‘హైడ్రా’ నేలమట్టం చేయడం సంచలనంగా మారింది. ఇటీవల అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపైనా కేసు నమోదుచేసి తమకు అందరూ సమానమేనని చాటింది. బీఆర్‌ఎస్ నేతకు సంబంధించినదిగా ఆరోపణలొస్తున్న జన్వాడ ఫాంహౌస్ కూడా రేపోమాపో నేలమట్టమయ్యే అవకాశాలుండం భూ అక్రమార్కుల గుండెల్లో గుభేల్‌మంటోంది.
హైదరాబాద్‌కు రక్షణగా ‘హైడ్రా’
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ చెరువులు, కుంటలు, పార్కుల పరిధుల్లో నిర్మితమైన భవనాల జాబితాను రూపొందించుకున్న ‘హైడ్రా’ అత్యంత పకడ్బందీగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే 18చోట్ల కూల్చివేతల పర్వాన్ని కొనసాగించిన ‘రంగనాథ్’ ఫోర్స్.. సర్కారు భూములను స్వాధీనపరిచే దిశగా చర్యలు చేపడుతోంది. బంజారాహిల్స్, చింతల్, మాదాపూర్, అమీర్‌పేట్, బోడుప్పల్, చందానగర్ తదితర ప్రాంతాల్లో ‘హైడ్రా’ చర్యలు కొనసాగించింది. వీటిల్లో ప్రతిపక్ష నేతలు, మాజీ ప్రజాప్రతినిధులకు సంబంధించిన నిర్మాణాలు కూడా ఉండటం గమనార్హం. వీటితో పాటు అనేక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా.. ఇప్పటికే సర్కారుకు నివేదిక అందజేసింది. మణికొండలోని కొన్ని విల్లాలకు కూడా నోటీసులివ్వడంతో యజమానులు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నట్టు తెలిసింది. సరైన వివరణలు రాకపోతే ఏ క్షణాన్నైనా కూల్చివేతలు తప్పవు. ఇప్పటికే హైకోర్టు కూడా నిబంధనల మేరకు చర్యలు కొనసాగించాలని సూచించడంతో ‘హైడ్రా’ మరింత దూకుడు ప్రదర్శించనున్నట్టు తెలుస్తోంది.
వెనక్కితగ్గని సర్కారు..
గతంలో అక్రమ నిర్మాణాలపై కేసీఆర్ ప్రభుత్వం చెప్పిన మాటలు నీటి మూటలుగా మిగిలిపోగా.. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలు, వర్గాలకతీతంగా ప్రభుత్వ భూములను చెరబట్టిన వారి పీచమణచటమనే పనిని మొదలు పెట్టింది. రేపోమాపో హైడ్రా గనక జన్వాడ ఫాంహౌస్‌ను కూల్చివేసే పరిస్థితే వస్తే, గత పదేళ్ల కాలంలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసి కట్టుకున్న తమ భవనాల పరిస్థితి ఏమిటి? కీలక నేతలే అక్రమ భూములను కాపాడుకోలేకపోతే ఇక తమ పరిస్థితేమిటని కొందరు మదనపడుతున్నారు. అక్రమాలపై ఫిర్యాదులు చేసీచేసీ విసిగిపోయిన సామాజిక కార్యకర్తలు, పర్యవరణ ప్రేమికులు మాత్రం ప్రజాపాలనలో మరోసారి ధైర్యంగా ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే డ్రగ్స్ మీద ఉక్కుపాదం, శాంతిభద్రతల వంటి అంశాల్లో ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. గొర్రెల స్కామ్, కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నాయి. ఇదేస్ఫూర్తితో ఉద్యమకాలం నాటి ఎజెండాలో అంశమైన అక్రమ కట్టడాలపై ‘హైడ్రా’ కొరడా రaుళిపిస్తుండటం తెలంగాణలో కొత్త చరిత్రను లిఖిస్తున్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
సీఎం రేవంత్ పులి విూద స్వారీ చేస్తున్నారు
` సీపీఐ నేత నారాయణ
హైదరాబాద్(జనంసాక్షి):హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు కబ్జా చేయడం వల్ల వర్షపు నీరు ఎటు వెళ్లాలో అర్థం కావడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో విూడియాతో నారాయణ మాట్లాడారు.అందుకే అరగంటపాటు వర్షం కురిస్తే నగరం ముంపునకు గురయ్యే పరిస్థితి వస్తోంది. హైడ్రా పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చుతున్నారు. వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలి. సీఎం రేవంత్‌రెడ్డి పులివిూద స్వారీ చేస్తున్నారు. ఆయన పులి విూద నుంచి దిగొద్దు.. దిగితే మింగేసే ప్రమాదం ఉంది. చెరువుల్లో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవ చేస్తున్నాయి. ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులు కబ్జా చేసి కార్యాలయాలు నడుపుతున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి’’అని నారాయణ డిమాండ్ చేశారు.భాజపాయేతర రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని దేశంలో ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. అదానీకి సెబీ దాసోహమైందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు.