ఇజ్రాయెల్‌`హమాస్‌ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్‌..

` పిల్లల వ్యాక్సినేషన్‌ కోసం మూడు రోజులపాటు కాల్పుల విరమణ
గాజాస్ట్రిప్‌(జనంసాక్షి):గత ఏడాది అక్టోబర్‌ నుంచి జరుగుతున్న ఇజ్రాయెల్‌`హమాస్‌ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్‌ పడిరది. గాజాలో బాంబుల మోతకు మూడు రోజులపాటు విరామం ఇచ్చేందుకు రెండు వర్గాలు అంగీకారానికి వచ్చాయి.6,40,000 మంది చిన్నారులకు తొలిరౌండ్‌ వ్యాక్సినేషన్‌ వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్‌ అధికారి వెల్లడిరచారు. కొద్దిరోజుల క్రితం టీకా తీసుకోని ఓ చిన్నారిలో పోలియో వైరస్‌ను గుర్తించారు. గాజా ప్రాంతంలో 25 ఏళ్లలో తొలిసారి ఈ కేసు వెలుగుచూడటం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈనేపథ్యంలో పోలియో వ్యాక్సిన్ల పంపిణీ నిమిత్తం మానవతా విరామానికి ఇరువర్గాలు అంగీకరించాయి. ఆదివారం నుంచి వ్యాక్సిన్లు వేసే కార్యక్రమం ప్రారంభం కానుంది. తొలుత సెంట్రల్‌ గాజా, తర్వాత దక్షిణ, ఉత్తర గాజాలోని చిన్నారులకు టీకాలు వేయనున్నట్లు ఆరోగ్య సంస్థ తెలిపింది. మొదటి రౌండ్‌ వేసిన నాలుగు వారాల తర్వాత రెండోవిడత టీకా వేయాల్సి ఉంటుందని తెలిపింది. అంతర్జాతీయంగా ఈ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు 90 శాతం కవరేజీ అవసరమని వెల్లడిరచింది.ఇదిలాఉంటే.. గత నెల పాలస్తీనాను పోలియో మహమ్మారి ప్రాంతంగా గాజా ఆరోగ్య శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌ సైనిక చర్య వల్ల అక్కడ ఆరోగ్య మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని.. ఈ పరిస్థితులు వైరస్‌ పునరుజ్జీవానికి దారితీశాయని ఆరోపించింది. దక్షిణ ఖాన్‌ యూనిస్‌ ప్రాంతంలో సేకరించిన మురుగు నీటి నమూనాల్లో అఖప2 రకం కనిపించిందని ప్రకటించింది. వైరస్‌ ఉనికి.. గాజా స్ట్రిప్‌ సహా పొరుగుదేశాల్లోని నివాసితులకు ముప్పుగా పరిణమిస్తుందని, ప్రపంచ పోలియో నిర్మూలన కార్యక్రమానికి ఎదురుదెబ్బ అని పేర్కొంది. ఈనేపథ్యంలోనే గాజాలో 25 ఏళ్లలో తొలిసారిగా ఒక చిన్నారికి వైరస్‌ సోకడంతో పక్షవాతానికి గురయ్యిందని ఆగస్టు 23న డబ్ల్యూహెచ్‌ఓ ధ్రువీకరించింది.