నిర్మల్‌ పట్టణాభివృద్దికి ప్రత్యేక చర్యలు

హైడ్రాలిక్‌ వాహనాన్ని ప్రారంభించిన మంత్రి
నిర్మల్‌,డిసెంబర్‌3 (జనంసాక్షి) : నిర్మల్‌ పురపాలక శాఖ ఆధ్వర్యంలో నూతనంగా కొనుగోలు చేసిన హైడ్రాలిక్‌ మౌంటెడ్‌ లాడర్‌ వాహనాన్ని గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రారంభించారు. నిర్మల్‌ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పాటైన నిర్మల్‌ జిల్లా కేంద్రంలో 4 వైపులా సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. 14 జంక్షన్‌లో హైమాస్ట్‌ లైటింగ్‌ను సైతం ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. కాగా, లైటింగ్‌ సిస్టానికి ఏదైనా సాంకేతిక పరంగా ఇబ్బందులు వస్తే క్రేన్‌ సహాయంతో రిపేర్‌ చేసేవారని, ఇప్పుడు ఈ వాహనం వల్ల వేగంగా తక్కువ వ్యవధిలోనే లైటింగ్‌ను రిపేర్‌ చేసుకునే సదుపాయం ఉందన్నారు. పురాతన కోట శ్యామ్‌ ఘర్‌ కోటను పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. తద్వారా పట్టణంలో విద్యుత్‌ స్థంబాలతో సమస్యలు ఉండవన్నారు. రూ.35 లక్షలతో కోట చుట్టూ లైటింగ్‌ ఏర్పాటు చేశామని వివరాలను వెల్లడించారు. దీంతో నిర్మల్‌కు కొత్త శోభ వచ్చిందన్నారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్‌ రాంకిషన్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్‌ రాం రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్‌ రెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.