నీటి విడుదలపై నిరవధిక దీక్ష

విజయవాడ, జూలై 26 : కృష్ణాడెల్టాకు సాగునీరు అందించే విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఆగస్టు 4వ తేదీనుండి ఆమరణ నిరాహారదీక్ష చేపడతామని రైతు సమాఖ్య నాయకుడు కృష్ణారావు తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నీటికి కూడా ప్రాంతీయతత్వం వివాదాస్పదం చేస్తున్నారని, తద్వారా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా స్పష్టమైన వైఖరితో వ్యవహరించాలని, ఒక రోజు నీళ్లు ఇచ్చి, రెండవ రోజు ఆపి, మూడవ రోజు కోర్టులో తాత్సారం చేయడం సమంజసం కాదన్నారు. సాగర్‌ నుండి కృష్ణాడెల్టాకు నీటి విడుదలపై హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులకు ప్రభుత్వం తక్షణమే కౌంటర్‌ దాఖలు చేయకుండా అలసత్వం వహిస్తుందన్నారు. రెండు రోజులు వర్షాలు పడి రిజర్వాయర్లు నిండితే ఆ నీటిని కృష్ణాడెల్టాకు వదిలితే సమస్య పరిష్కారమైపోతుందని ప్రభుత్వం భావించడం సరికాదన్నారు. ఏదేమైనా ఈ సమస్యకు వారం లోపు శాశ్వత పరిష్కారం చూపాలని, లేకుంటే తాను ఆమరణ దీక్ష చేపడతానని ఆయన హెచ్చరించారు.