నేటి నుంచి మద్యం అమ్మకాలు బంద్!
– బోనాల పండుగ సందర్భంగా పోలీస్‌శాఖ ఆంక్షలు
హైదరాబాద్, ఆగస్టు4(జనం సాక్షి) : బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో నేటి నుండి రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలను బంద్ చేయనున్నారు. హైదరాబాద్, రాచకొండ పోలీసుల కమిషనరేట్ పరిధిలో వచ్చే రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను బంద్ చేయాలంటూ పోలీసు కమిషనర్‌లు అంజనీకుమార్, మహేష్‌భగవత్‌లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు నగరంలోని వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలలో మద్యం అమ్మకాలను నిషేదించారు. ఎల్బీనగర్, మల్కాజిగిరి డీసీపీ జోన్‌ల పరిధిలలో నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరపడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మద్యం అమ్మకాలను నిలిపివేయబోతోంది. మరోవైపు బోనాల దృష్ట్యా ముందస్తుగా మద్యం అమ్మకాలు శనివారం భారీగా పెరిగింది.


