నేడు టీడీఎల్పీ నేతను ప్రకటించనున్న చంద్రబాబు
– సండ్ర వెంకటవీరయ్యకే అవకాశం
హైదరాబాద్,నవంబర్1(జనంసాక్షి):తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుగు చంద్రబాబు నాయుడు గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో భేటీకానున్నారు. ఈ భేటీ తెలంగాణాలో పార్టీ అభివృద్ధి, టీడీఎల్పీ నేత ఎంపిక, లోక్ నియోజకవర్గాల్లో ఇంచార్జ్ ల నియామకంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీకి బలమైన నాయకుడిగా భావించిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవటం, రేవంత్ వెంట పలువురు తెదేపా నేతలు కాంగ్రెస్‌లో చేరడంతో పార్టీ బలోపేతంపై చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. టీడీఎల్పీ నేతను గురువారం చంద్రబాబునాయుడు ప్రకటించనున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌లో గురువారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు భేటీ కానున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో పార్టీ పటిష్ఠత కోసం చేపట్టే కార్యక్రమాలపై సుధీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవటంతో రేవంత్ వెంట ఎంతమంది తెదేపా నేతలు వెళ్లారు.. ఇంకెంతమంది వెళ్తారు.. వారిని ఏ విధంగా కట్టడి చేయాలనే దానిపై చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాలకు అధ్యక్షులను నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అంతేగాక టీడీఎల్పీ నేతను కూడా ప్రకటిస్తారు. ప్రస్తుతం టీడీఎల్పీ నేతగా ఉన్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో టీడీఎల్పీ నేతను ఎన్నుకోవాల్సి వస్తోంది. అయితే… ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఇద్దరు మాత్రమే ఎమ్మెల్యేలున్నారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాత్రమే టీడీపీలో ఉన్నారు. మిగతా వారు టీఆర్‌ఎస్ పార్టీలో చేరిపోయారు. అయితే… ప్రస్తుతమున్న ఇద్దరిలో ఎవరో ఒకరు టీడీఎల్పీ నేతగా ఎన్నికవుతారు.



