పత్తి రైతులకు అండగా ఉంటాం

– ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టాం
– రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించాం
– రైతులకు మధ్దతు ధర కల్పించేందుకే రైతు సమితులు
– వ్యవసాయం దండగకాదు.. పండగగా మారుస్తాం
– రైతులను రాజులుగా చూడటమే తన లక్ష్యం
– పంటలు తగలబెడుతూ రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుంది
– అసెంబ్లీలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
హైదరాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. శాసనసభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. పత్తికి కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ సారి పత్తి రైతులకు మంచి మద్దతు ధర వస్తుందని ఆశిస్తున్నామని సీఎం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 48లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారని తెలిపారు. ఇప్పటికీ 5శాతంలోపే పత్తి మార్కెట్‌లోకి వచ్చిందన్నారు. కొన్ని చోట్ల మంచి పత్తికి కనీస మద్దతు ధర కంటే ఎక్కువనే ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు. మద్దతు ధర కోసమే రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. పంట కాలనీలు వేసి.. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల కాంగ్రెస్‌ నేతలే పంటలను తగులబెట్టే కార్యక్రమం చేపడుతున్నారని సీఎం పేర్కొన్నారు. గతంలో ఖమ్మంలో వ్యవసాయ మార్కెట్‌లపై దాడులు చేసింది కాంగ్రెస్‌ కార్యకర్తలేనన్నారు.. ఇప్పుడు దోమపోటుతో వరి దెబ్బతింటుందని కాంగ్రెసోళ్లే పంటలను తగలబెట్టి రాజకీయంగా లబ్ధిపొందేందుకు తాపత్రయ పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వడం జరగదని సీఎం స్పష్టంచేశారు. పరిహారం ఇవ్వాలంటే నాలుగు సంవత్సరాల బడ్జెట్‌ కూడా సరిపోదని సీఎం తెలిపారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించాం. నాణ్యమైన కరెంట్‌ను అందిస్తున్నాం. రుణాలు మాఫీ చేయడంలో విజయం సాధించామని సీఎం తెలిపారు. దేశంలోనే ప్రప్రథమంగా రూ. 300కోట్ల ఖర్చుతో రైతు వేధికలు నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అక్కడ రైతులు ఉమ్మడిగా చర్చలు జరుపుకొనేందుకు ఉపయోగపడతాయన్నారు. 2856 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించటం జరిగిందని, వీరు గ్రామాల్లో రైతులకు సాగులో సలహాలుసూచనలు అందజేస్తారన్నారు. వచ్చే వర్షాకాలం పంట నుంచి ఏ కుంటలో, ఏ సెంట్‌లో ఏ పంటవేయాలో క్రాఫ్‌ కాలనీల ద్వారా, రైతు సమన్వయ సమితుల ద్వారా అందజేయడం జరుగుతుందని సీఎం తెలిపారు. ప్రతి మండలంలో ఉన్న వ్యవసాయాధికారికి శిక్షణ ఇస్తున్నాం.. ఇవన్నీ రైతుల మేలు కోరి చేస్తున్న ప్రయత్నాలే అని సీఎం తెలిపారు. వ్యవసాయం దండగ కాదు.. వ్యవసాయం పండగ అని నిరూపించడానికి.. రైతును రాజును చేయడానికి చిత్తశుద్దితో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. రైతులకు మేలుకోసం ఎకరానికి 4వేల చొప్పున ఖరీఫ్‌, రబీకి పెట్టుబడికి రూ. 8వేలు అందిస్తామని ఇప్పటికే చెప్పామని, అది వచ్చే ఖరీఫ్‌ నుంచి అందజేయడం జరుగుతుందన్నారు.. దీనిని కాంగ్రెస్‌ నేతలు తట్టుకోలేక పోతున్నారు. అందుకే కాంగ్రెస్‌ నేతలు రైతుల పేరుతో రాజకీయ రాద్దాంతం చేసేందుకు తాపత్రయ పడుతుందన్నారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారని వారే తగిన గుణపాఠం చెబుతారని సీఎం
హెచ్చరించారు.