బోనమెత్తిన మెదక్ మున్నూరు కాపు సంఘం

వివిధ కళారూపాల్లో భారీ బోనాల ఊరేగింపు
పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
మెదక్ జూన్ 22 (జనం సాక్షి ) మెదక్ అమ్మా బెల్లెల్లినాదో.. నాయనా.. తల్లీ బెల్లెల్లినాదో.. అంటూ జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీ మాత నల్ల పోచమ్మ 20 వ బోనాల వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భిన్న సంస్కృతులతో అలరారుతూ. నిర్వహించిన బోనాల పండుగ సంబరం అంబరాన్నం టాయి. దాంతో మెదక్ కొత్త శోభ సంతరించుకుంది. డప్పుల దరువులు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య బోనాల ఊరేగింపులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని నవా పేట, పెద్దబజార్, న్యూమార్కెట్, పిట్లంబేస్, బార హిమామ్, ఫతే నగర్, గాంధీనగర్, దాయర, హౌసింగ్ బోర్డు, ఇందిరా కాలనీ, మిలిటరీ కాలనీ, సుభాష్ నగర్ కాలనీ, జమ్మికుంట, అజంపుర, సాయినగర్, వెంకట్రావు నగర్, కొలిగడ్డతో పాటు ఆయా వీధులకు చెందిన బోనాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రాందాస్ చౌరస్తాలో కాంతరాలు, శివ విన్యాసాలు ఫుల్ బ్యాండ్ మేళాలు, డీజే సౌండ్ తో దద్దరిల్లింది అనంతరం ఊరేగింపుగా వెళ్లి మాత నల్ల పోచమ్మ దేవాలయం వద్ద బోనాలు సమర్పించారు.ప్రముఖుల హాజరు.మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొని బోనం ఎత్తుకున్నారు. యువతతో కలిసి నృత్యం చేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మాజు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక భూపతి రాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పురోషోత్తమ రావు, పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య, మహాసభ అధ్యక్షుడు గంపా చంద్రమోహన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్, జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్, జిల్లా అధ్యక్షుడు బట్టి ఉదయ్ కుమార్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రాము, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బోనాల ఊరేగింపులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు పలువురిని అలరించాయి.



