ప్రభుత్వ పాఠశాలల వైపు గ్రామం.. సంచలన నిర్ణయం తీసుకున్న న్యావనంది ప్రజలు

సిరికొండ జూన్ 22 (జనం సాక్షి): ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, గ్రామంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని న్యావనంది గ్రామ ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై గ్రామంలోని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ పంచాయతీ పాలకవర్గం సంయుక్తంగా నిర్ణయించింది.ఈ మేరకు గ్రామంలోకి వచ్చిన ప్రైవేట్ పాఠశాలల బస్సులను గ్రామస్తులు అడ్డుకొని తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని తీర్మానించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, అర్హత కలిగిన ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగితేనే విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని, ప్రభుత్వాలు కూడా మరిన్ని వసతులు కల్పించేందుకు అవకాశం ఉంటుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ పాఠశాలల పేరుతో తల్లిదండ్రులపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించేందుకు కూడా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం గ్రామ ప్రజలంతా ఐక్యంగా నిలవాలని, గ్రామ భవిష్యత్తు కోసం ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పిలుపునిచ్చారు. ఈ నిర్ణయం ప్రస్తుతం మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.