పత్రికా స్వేచ్ఛకోసం ఐక్య ఉద్యమాలు

ఈ నెల 30న రాజధానిలో కలాల కవాతు
అల్లంనారాయణ

హైదరాబాద్‌, అక్టోబర్‌ 22 (జనంసాక్షి) :
పత్రికా స్వేచ్ఛ కోసం జరిగే ఉద్యమాల్లో అందరూ కలిసి రావాలని ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశం పిలుపునిచ్చింది. జర్నలిస్టుల హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు చేపట్టాలని, ప్రభుత్వాల నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమించాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో పత్రికా స్వేచ్ఛ అంశంపై సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎడిటర్స్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీజేఎఫ్‌ చైర్మన్‌ అల్లం నారాయణ (నమస్తే తెలంగాణ), టంకశాల అశోక్‌ (హన్స్‌ ఇండియా), దిలీప్‌రెడ్డి (సాక్షి టీవీ), శైలేష్‌రెడ్డి (జీ 24 గంటలు), నారాయణరెడ్డి (టీ న్యూస్‌), లతో పాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరయ్యారు. పత్రికా స్వేచ్ఛపై ప్రభుత్వం జరుపుతున్న దాడిని ఈ సమావేశం ముక్తకంఠంతో ఖండించింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు ఆమోదించింది. అందులో ముఖ్యమైనవి.. పత్రికా స్వేచ్ఛ కోసం జరిగే ఉద్యమాల్లో అందరూ కలిసి రావాలి. పాలకులు, ప్రభుత్వాల నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా విశాల ఉద్యమాలను నిర్మించాలి. పాలకుల పక్షపాత ధోరణిపై అంతర్జాతీయ సంస్థల దృష్టికి తీసుకువెళ్లాలనని తీర్మానించారు. అంతకుముందు చర్చలో నమస్తే తెలంగాణ ఎడిటర్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ.. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడిని ఖండించారు. ప్రభుత్వం జర్నలిస్టుల మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. జీవ వైవిధ్య సదస్సుకు వచ్చిన ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పర్యటన కవరేజీకి వెల్లిన తెలంగాణ ప్రాంతానికి చెందిన విూడియాకు పాసులు ఇచ్చి వెలివేయడం.. పత్రికా స్వేచ్ఛపై దాడిగానే పరిగణించాలని కోరారు. దీన్ని ఇంతటితో వదిలేస్తే.. రేపు అన్ని ప్రాంతాల విూడియాకు ఇదే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. ‘ఇవాళ పాలకులు ఒక ప్రాంతానికి చెందిన జర్నలిస్టులను అవమానపరిచిన్రు. రేపు తమకు అనుకూలంగా లేరని మరో విూడియాను వెలివేసి ప్రమాదం ఉంది’ అని స్పష్టం చేశారు. పాలకుల, ప్రభుత్వాల నిరంకుశ ధోరణులకు వ్యతిరేకంగా విశాల ఉద్యమాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. దేశాధినతే సాక్షిగా విూడియా పట్ల చూపిన వివక్షతపై అంతర్జాతీయ సంస్థల దృష్టికి తీసుకెళ్లేందుకు లేఖలు రాయనున్నట్లు చెప్పారు. అల్లం నారాయణ వాదనతో మిగతా వారు కూడా ఏకీభవించారు. దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ.. పత్రికా స్వేచ్ఛ కాపాడుకునేందుకు జర్నలిస్టులంతా ప్రాంతాలకతీతంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాలకుల అణచివేతపై ఇప్పుడు మాట్లాడకుంటే.. మున్ముందు మరింత అణచివేస్తారని హెచ్చరించారు. టంకశాల అశోక్‌ మాట్లాడుతూ.. జర్నలిస్టుల ఐక్యతను దెబ్బ తీసేందుకు, ప్రాంతాల వారీగా విూడియాను విడదీసేందుకు ప్రభుత్వం ఒక కుట్ర పన్నిందన్నారు. దాన్ని తిప్పికొట్టేందుకు జర్నలిస్టులంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఉద్యమాల ద్వారానే పత్రికా స్వేచ్ఛను కాపాడుకోగలమని, పాలకుల నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. శేలైష్‌రెడ్డి మాట్లాడుతూ.. విూడియా విషయంలోనూ ప్రభుత్వం విభజించు-పాలించు సూత్రాన్ని పాటిస్తోందని ధ్వజమెత్తారు. పత్రికా స్వేచ్ఛపై పాలకుల నిర్లక్ష్యాన్ని, నిరంకుశ ధోరణిని ఎండగడదామన్నారు.