పద్దచెరువుగట్టులో శిశువుల మృతదేహాలు లభ్యం!

మహబూబ్‌నగర్‌, జూన్‌ 29 : పెద్దచెరువుగట్టు ప్రాంతంలో మృతదేహాలు లభ్యమయ్యాయన్న వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ ఉదంతం శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. పైగా అవన్నీ చిన్నపిల్లల మృతదేహాలు కావడం మరింత సంచలనమైంది. తొలుత ఆరు మృతదేహాలు కనిపించాయని స్థానికులు తెలిపారు. ఆ తర్వాత 20 మృతదేహాలను గుర్తించినట్టు చెప్పారు. పైగా అవన్నీ మగ శిశువులుగా వైద్యులు గుర్తించినట్టు సమాచారం. పెద్దచెరువుగట్టు చుట్టుపక్కల ఆసుపత్రులు ఉండడంతో ప్రయోగాల నిమిత్తం వైద్యులు వాడి ఉంటారనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు మెడికల్‌ కళాశాలలో ప్రయోగాల కోసమే మృతదేహాలను తెచ్చి ఉంటారనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ఇదిలా ఉండగా పెద్ద సంఖ్యలో శిశువుల మృతదేహాలు వెలుగు చూడడంతో రంగంలోకి పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.