పద్మశాలీలను ప్రభుత్వం ఆదుకోవాలి : రమణ

కరీంనగర్‌, ఆగస్టు 3 : పద్మశాలి కులస్థులు రాజకీయ రంగంతోపాటు ఇతర రంగాలలో కూడా ముందంజలో ఉండాలని జగిత్యాల టీడీపీ ఎమ్మెల్యే రమణ అన్నారు. శుక్రవారంనాడు ఆయన రాయికల్‌ మండలంలోని కుమ్మరపల్లి గ్రామంలో పద్మశాలి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పద్మశాలి కులస్థులు రాజకీయ రంగంలోపైకి రావాలని అందుకు వివిధ పార్టీ నాయకులు వారిని పైకి తీసుకురావాలని అన్నారు. రాష్ట్రంలోని చేనేత పరిశ్రమలలో అర్హులైన పద్మశాలిలకు ఉద్యోగాలు కల్పించాలని ఆయన కోరారు. ఉద్యోగాలు దొరకక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇందుకు ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమేనిన ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా పద్మశాలిలు ఏకతాటిపై నిలిచి పోరాడి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా రమణ గ్రామంలోని మౌలిక సుదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రేషన్‌ కార్డులు, వితంతు పెన్షన్లు, ఇందిరమ్మ గృహాలు అందడం లేదని వారు ఎమ్మెల్యేను కోరారు. అర్హులైనవారందరికీ ప్రభుత్వం నుండి సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకుంటామని రమణ గ్రామస్థులకు తెలిపారు.