నిరుపయోగంగా ఆర్.అండ్.బి అతిధి గృహం

శిథిలావస్థకు చేరుకుంటున్న చారిత్రక కట్టడం

ఒకప్పుడు సందడి.. నేడు వెలవెల

కబ్జాకు గురయ్యే ప్రమాదం

ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి

జడ్చర్ల, జూన్ 25 (జనంసాక్షి): ఒకప్పుడు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల రాకతో సందడిగా ఉండే జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట ఆర్.అండ్.బి అతిథి గృహం, నేడు నిర్వహణ కరువై నిరుపయోగంగా మారుతోంది. 44వ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ అతిథి గృహం నిజాం పాలనలో నిర్మితమై చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉంది. అయితే, ప్రస్తుతం తగిన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ భవనం తన పూర్వ వైభవాన్ని కోల్పోయి, శిథిలావస్థ వైపు పయనిస్తోంది.

ఒకప్పుడు సందడి.. నేడు వెలవెల: నిజాం కాలంలో నిర్మించిన ఈ అతిథి గృహం దశాబ్దాల పాటు జడ్చర్లకు వచ్చే విఐపిలు, జిల్లా స్థాయి ఉన్నత అధికారుల బసకు ప్రధాన కేంద్రంగా ఉండేది. నిన్న మొన్నటి వరకు ఈ ప్రాంగణం ప్రజా ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు మరియు విలేకరుల సమావేశాలతో నిరంతరం కళకళలాడుతూ ఉండేది. రాజకీయ కార్యకలాపాలకు, అధికారిక చర్చలకు ఇది ప్రధాన వేదికగా నిలిచేది. కానీ కాలక్రమేణా పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, అంబేద్కర్ కళాభవన్ వంటి కొత్త భవనాల నిర్మాణాలు రావడంతో, పాత ప్రభుత్వ అతిథి గృహం ప్రాధాన్యత తగ్గింది. ప్రస్తుతం ఇందులో ఎలాంటి ప్రభుత్వ లేదా అధికారుల కార్యకలాపాలు లేకపోవడంతో, భవనం పూర్తిగా నిరుపయోగంగా మారుతోంది.

కబ్జాకు గురయ్యే ప్రమాదం: భవనం పట్ల పర్యవేక్షణ లోపిస్తే, అతిథి గృహానికి చెందిన విలువైన స్థలం కబ్జా అయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే, భవిష్యత్తులో స్థలం అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం ఉంది.

ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి: చారిత్రక నేపథ్యం ఉన్న ఈ అతిథి గృహాన్ని పునరుద్ధరిస్తే, ప్రభుత్వానికి ఆదాయంతో పాటు అవసరమైన సమయంలో ఉపయోగకరంగా ఉంటుంది. కనీసం ఇప్పటికైనా సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు స్పందించి, ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవడంలో తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

తాజావార్తలు