యూరియా బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తున్న ఫెర్టిలైజర్ వ్యాపారులు

అధికారుల పర్యవేక్షణ లోపంతోనే అక్రమాలు..

వెంటనే చర్యలు తీసుకోవాలి… లేదంటే భారీ ఎత్తున నిరసనలు తప్పదు.

తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్ హెచ్చరిక

ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో పత్తి పంటలకు ఎరువులు వేయాల్సిన కీలక సమయంలో, కేరామెరి మండలంలోని ఫెర్టిలైజర్ షాపు నిర్వాహకులు సబ్సిడీ యూరియాను అక్రమ మార్గాల్లో విక్రయిస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం కేరామెరి మండలం ఝరి గ్రామంలో తుడుందెబ్బ నాయకులు, స్థానిక రైతులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోవ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన యూరియా గరిష్ట విక్రయ ధర కేవలం 267 కాగా, స్థానిక వ్యాపారులు డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని బస్తాకు రూ 350 నుండి పైగా వసూలు చేస్తూ రైతులను దారుణంగా మోసం చేస్తూన్నారని మండిపడ్డారు.ఎరువుల కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు వ్యాపారులు కుయుక్తులు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. షాపుల్లో యూరియా స్టాక్ ఉన్నప్పటికీ, ఆన్‌లైన్ యాప్‌లలో నిల్వలు లేనట్లు చూపిస్తున్నారని, ఒకవేళ స్టాక్ చూపించినా కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ‘స్టాక్ పూర్తయింది’ (స్టాక్ కంప్లీట్ ) అని చూపిస్తూ అమాయక రైతులకు యూరియా అందకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ బుకింగ్స్ ఎలా చేసుకోవాలో తెలియక సాధారణ రైతులు ఇబ్బంది పడుతుంటే, బుకింగ్ చేసుకున్న వారికి కూడా అధిక ధరలకే విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు.ఈ దోపిడీపై మండల, జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులకు పలుమార్లు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. రైతులకు న్యాయం చేయాల్సిన అధికారులే ఫెర్టిలైజర్ షాపు నిర్వాహకులతో కుమ్మక్కయ్యారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని దుయ్యబట్టారు.సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కేరామెరి మండలంలో యూరియాను అక్రమంగా, అధిక ధరలకు అమ్ముతున్న ఫెర్టిలైజర్ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, సదరు దుకాణాల లైసెన్సులను రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, రానున్న రోజుల్లో కేరామెరి మండల కేంద్రంలో రైతులతో కలిసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ సమావేశంలో తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు మడపచి భీంరావు, నాయకులు మడవి పురుషోత్తం, పెందోర్ వినేష్, అడ చిన్నూ, విలాష్,మండల ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గోన్నారు.

తాజావార్తలు