పరీక్షలు వాయిదా వేయండి..
కేంద్ర విద్యాశాఖకు ఆన్లైన్లో విద్యార్థుల విజ్ఞప్తి
న్యూఢిల్లీ,డిసెంబరు 7 (జనంసాక్షి):కరోనా వైరస్ విసిరిన పంజాకు జనజీవనం అతలాకుతలమైంది. అనేక రంగాలూ దెబ్బతిన్నాయి. మరీ ముఖ్యంగా విద్యారంగానికి కొవిడ్ కొత్త పరీక్ష పెట్టింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గందరగోళంలో పడేసింది. ఇప్పటికీ స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోకపోడంతో పిల్లల చదువులు ఏమైపోతాయోన్న భయం తల్లిదండ్రులను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ ఏడాది పరీక్షలు ఎంత కష్టమైన పరిస్థితుల్లో జరిగాయో, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో అందరం చూశాం. ఇప్పుడున్న పరిస్థితులతో 2021లో పరీక్షల సంగతి ఏమిటో ఎవరికీ అర్థంకావడంలేదు. విద్యారంగంలో నెలకొన్న ఈ అనిశ్చితి నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 10న ఉదయం 10గంటలకు ఆన్లైన్ చర్చా వేదిక ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు. వచ్చే ఏడాదిలో నిర్వహించాల్సిన సీబీఎస్ఈ బోర్డు పరీక్షలతో పాటు జేఈఈ మెయిన్, నీట్ వంటి పోటీ పరీక్షల నిర్వహణపై కీలకంగా చర్చించనున్నారు.ఆయా వర్గాల నుంచి ప్రశ్నలను, సలహాలు, అభిప్రాయాలను ఆహ్వానించారు. వాస్తవానికి డిసెంబర్ 3న ఈ వెబినార్ జరగాల్సి ఉన్నప్పటికీ ఈ నెల 10కి వాయిదా పడింది. కరోనా నేపథ్యంలో ఎదురైన కష్టసమయంలో ఆన్లైన్ విద్యా విధానాలకు అనుగుణంగా విద్యార్థులకు సహకరిస్తున్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను మంత్రి అభినందించారు. పెద్ద సవాళ్లను పెద్ద అవకాశాలుగా మార్చుకోవాలని మోదీ చెబుతుంటారని గుర్తుచేసుకున్నారు. మంత్రి పోఖ్రియాల్ ఇచ్చిన పిలుపుతో దేశ వ్యాప్తంగా తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. పరీక్షలపై ఆందోళన వ్యక్తంచేయడంతో పాటు పలు సూచనలు ఇస్తున్నారు. కొందరు విద్యార్థులు ఆన్లైన్లో పరీక్షలు పెట్టాలని అభ్యర్థిస్తుండగా.. ఇంకొందరైతే ఆఫ్‌లైన్‌లోనే పెట్టాలని కోరుతున్నారు. సిలబస్‌ను తగ్గించడంతో పాటు బోర్డు పరీక్షలను ఏప్రిల్ -మే వరకు వాయిదా వేయాలని అనేకమంది విద్యార్థులు అభ్యర్థిస్తున్నారు.