పాపం ఈఅమ్మ ఉలుకదు.. పలుకదు ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవరిది!

పాపం ఓ అమ్మ.. నా అన్న వాళ్లు లేరో.. ఉన్నా పట్టించుకోవడం లేదేమో ! ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఎవరైనా వదిలేసారేమో తెలియలేదు. వయస్సు మాత్రం 85 ఏళ్లకు పైనే. ఎవరు పలుకరించినా ఉలుకదూ పలుకదు. అన్నింటికీ ఆ పండుటాకు బేల చూపులతో, నీళ్లు నిండిన కళ్లతోనే సమాధానం చెబుతోంది. గోదావరిఖనిలోని జీఎం కాలనీ దగ్గరి బస్టాపై ఆమె ఇల్లు. ఆ బస్టాప్‌లో ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి తడుస్తూ, చలికి వణుకుతూ నరకయాతన పడుతోంది. తన బాధ చెప్పుకుందామనుకున్న మాట పెగల్లేని దుస్థితి. వివరాలడిగితే సైగలు మాత్రం చేస్తుంది. కనీసం అడుక్కోవడానికైనా ఆ తల్లి సైగలే కదా చేసేది. ఇంకా బాధనెలా చెప్తుంది ? కారణమేంటో తెలియదు.. ఆ అవ్వ రెండు కాళ్లూ పని చేయవు. పాక్కుంటూ దేక్కుంటూ ముందుకు సాగుతూ భిక్షాటన చేయడం చూసేవారికి కన్నీళ్లు తెప్పించక మానవు. ఎవరైనా దయతలచి పెడితే ఆ పూట కడుపు నింపుకుంటోంది. లేదంటే, అడుక్కున్న రూపాయో, రెండు రూపాయలతో ఏ బిస్కెటో, బన్నో కొని బతుకడానికి ప్రయత్నిస్తున్నది. ఏదేమైనా ఆ అమ్మ పరిస్థితి మాత్రం అత్యంత దయనీయం. ఎవరైనా సహృదయులు ముందుకు వచ్చి ఆ అనామక, విధివంచిత అమ్మకు ఇంత సాయం చేసి, పుణ్యం కట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

– పవర్‌హౌస్‌కాలనీ, జనంసాక్షి