పారిశ్రామిక వృద్ధి రేటు నిరాశాజనకం : ప్రణబ్‌ నిట్టూర్పు

న్యూఢిలీ :  పారిశ్రామిక వృద్ధి రేటు 0.1 శాతానికి క్షీణించడం పట్ల ఆర్థిక శాఖా మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ విచారం వ్యక్తం చేశారు. పారిశ్రామిక రంగానికి అత్యవసరంగా  ప్రోత్సాహకాలు ఇవ్వవలసిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. పారి శ్రామిక వృద్ధి రేటు క్షీణిచండం తనకు చాలా నిరాశ కలిగించిందని అన్నారు.. పారిశ్రామిక ఉత్పత్తి ఏమీ పెరగలేదు. కొన్ని నెగటీవ్‌ సెంటిమెంట్లు వృద్ధి రేటును ప్రభావితం చేశాయన్నారు. పరిశ్రమలకు  ప్రోద్భలం ఇవ్వవలసిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా క్యాపిటల్‌ గూడ్స్‌ సెక్టార్‌ బాగా నిరాశ పరిచిందని ప్రణబ్‌  వ్యాఖ్యానించారు. మొత్తం 22 పారిశ్రామిక రంగాల్లో 12 ఫలితాలు మాత్రమే సానుకూల  వృద్ధి సాధించాయని ఆయన  వివరించారు. ఏప్రిల్‌ మాసంలో పారిశ్రామిక వృద్ధిరేటు 0.1 శాతంగా నమోదు అయిన విషయం   తెలిసిందే.

ప్రమాదకర స్థాయికి పారిశ్రామిక వృద్ధి రేటు

దేశ ఆర్థిక వ్యవస్థకు  కీలక చోదక శక్తిగా పరిగణించే పారిశ్రామిక వృద్ధిరేటు ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఏప్రిల్‌ మాసంలో ఈ వృద్ధి రేటు కేవలం 0.1 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే నెలలో పారిశ్రామిక వృద్ధిరేటు 5.3 శాతం. 2011-12 సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధిరేటు తొమ్మిదేళ్ల కనిష్ఠ స్థాయికి క్షీణించిన నేపథ్యంలో స్టాటిస్టిక్‌ విభాగం వెలువరించిన ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కీలకమైన ఉత్పాదక రంగంలో వృద్దిరేటు అనూహ్య రీతిలో 0.1 శాతానికి పడిపోయింది. గత ఏడాది ఏప్రిల్‌ మాసంలో ఉత్పాదక వృద్ధిరేటు 5.7 శాతంగా ఉంది.  అలాగే ఖనిజ రంగంలో వృద్ధిరేటు తిరోగమనం చెంది -3.1 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే నెలలో గనుల రంగం వృద్ధి రేటు 1.6 శాతం. విద్యుత్‌ వృద్ధిరేటు కూడా క్షీణించింది. ఏప్రిల్‌లో విద్యుత్‌ రంగ వృద్ధి రేటు 4.6 శాతంగా నమోదు కాగా, గత ఏడాది ఇదే కాలానికి ఈ వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదైంది.