పాలమూరు పల్లెలో నిశ్శబ్ధ సాంకేతిక విప్లవం

కంప్యూటర్‌ పలకలపై అక్షర ఆయుధాలు దిద్దుతున్న తొలితరం
పలకా, బలపం లేని పేద పిల్లల చేతుల్లో ఐ స్లేట్లు
అది అమ్మానాన్నల బడి.. ఎందుకంటే, ఆ బడి పిల్లలకు మమ్మీ డాడీలంటే
తెలియదు. బురద పొలాల్లో నుంచి పిండిన హేమం.. అది మట్టి వాసనల పరిమళాలు తప్ప
సెంటు వాసనలు తెలియని ప్రకృతి ఒడి.. అది గరీబోళ్ల బడి.. పాత పలకలు పట్టే చేతుల్లో
అక్షరాలు నాట్యం చేసే డిజిటల్‌ పలను చూడాలని శాస్త్ర సాంకేతిక రంగాల నిపుణులు కన్న కలలకు వేదికైన ఓ చదువుల గడి. ఐ-స్లేట్లు వాడుతున్న మొదటి తరం చిన్నారుల్లో తన నీడన వెలుగులు నింపుతున్న చల్లని ఒడి. అదే మహబూబ్‌నగర్‌ జిల్లా ఘన్‌పూర్‌ మండలంలోని మహ్మద్‌ హుస్సేన్‌పల్లి గ్రామంలో నెలకొన్న సర్కారు బడి.
ఘన్‌పూర్‌ ( మహబూబ్‌నగర్‌ ), ఆగస్టు 14 (జనంసాక్షి) : ఓ వైపు భారతావని 66 స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకునేందుకు సన్నాహాలు చేసుకుంటే, మరో వైపు మన రాష్ట్రంలోని ఓ కుగ్రామం సాంకేతిక విప్లవ ఆవిష్కణకు వేదికైంది. దేశంలోనే తొలిసారి ఐ-స్లేట్స్‌ (కంప్యూటర్‌ పలకలు) ఉపయోగించిన తొలి విద్యార్థులుగా ఆ గ్రామానికి చెందిన 20 మంది ప్రభుత్వ పాఠశాల బాలబాలికలు చరిత్రకెక్కారు. కానీ, ఇంకా పూర్తి స్థాయిలో బహిర్గతమవని చరితం. వర్షం వస్తే తరగతి గదుల్లోకి ఇప్పటికీ నీళ్లొచ్చే ఆ పాఠశాల ఉన్నది మన తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా ఘన్‌పూర్‌ మండలంలోని మహ్మద్‌ హుస్సేన్‌పల్లిలో. మంగళవారం దేశంలోనే తొలిసారి ప్రవేశ పెట్టిన ఐ-స్లేట్స్‌ను ప్రభుత్వం ఆ పాఠశాలకు చెందిన 20 మందికి అందజేసింది. పాఠశాల గణితం ఉపాధ్యాయుడు టి.శ్రీనివాస్‌ విద్యార్థులకు ఐ-స్లేట్స్‌ను ఎలా వాడాలో నేర్పించారు. ఈ సందర్భంగా టి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఈ ఐ-స్లేట్స్‌ ద్వారా విద్యార్థులకు వెబ్‌ డిజైనింగ్‌పై అవగాహన కలుగుతుందన్నారు. అత్యాధునిక పద్ధతుల్లో లెక్కలు, పాఠాలు నేర్చుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. ఐ-స్లేట్‌ ఉన్న విద్యార్థి ఇంట్లో ఏ సబ్జెక్టుపై ఎంత సేపు దాన్ని వినియోగిస్తున్నాడో టీచర్‌ తెలుసుకునేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ఉంటుందని శ్రీనివాస్‌ వివరించారు. దీని వల్ల విద్యార్థులపై ఉపాధ్యాయుల అజమాయిషీ కూడా పెరుగుతుందని వెల్లడించారు. గ్రామానికి చెందిన రైతు పంద నర్సిహా తన కూతురు శిరీష చేతిలో ఐ-స్లేట్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. తన కూతురు తనలా కాకుండా మంచి చదువులు చదవాలని కోరుకుంటున్నానని, తనకు తెలియని విషయాలు తన కూతురు ఆ చిన్న మిషన్‌లో వివరిస్తుంటే ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశాడు. ఏదేమైనా ఈ ఐ-స్లేట్లు విద్యారంగం ఓ సంచలనం కానున్నవన్నది సుస్పష్టం.