పిసిసి పీఠంపై నేతల కన్ను
పోటీ పడుతున్న కోమటిరెడ్డి, రేవంత్ వర్గాలు
ఎవిరికిచ్చినా మరోకరు పార్టీ వీడే ఛాన్స్?
హైదరాబాద్,డిసెంబర్5 (జనంసాక్షి) : పిసిసి చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా ప్రకటనతో ఇప్పుడు అందరి దృష్టి తదుపరి పిసిసి చీఫ్ ఎవరన్నదానిపై పడింది. కాంగ్రెస్‌లో ఓటమి విశ్లేషణలకన్నా పదవులపైనే ప్రధాన దృష్టి పెట్టారు. ఉత్తమ్ రాజీనామాతో ఇప్పుడు పిసిసి పీఠం కోసం నేతల్లో పోటీ నెలకొంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ,శ్రీధర్ బాబు తదితరులు రేసులో ఉన్నారు. అయితే రేవంత్‌కు పదవిపై ఇప్పటికే పార్టీలో ఓ వర్గం వ్యతిరేకిస్తోంది. ఉత్తమ్ కుమార్ రాజీనామాతో టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి వర్గంలో ఆశలు చిగురిస్తున్నాయి.
పీసీసీ పదవీ బాధ్యతలు రేవంత్‌ను అప్పగిస్తారని ఆయన వర్గం నేతలు, అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నానాటికీ దిగజారిపోతున్న కాంగ్రెస్ పార్టీని ఆయన మాత్రమే గాడిలోపెట్టగలరని, కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురాగలరని బలంగా నమ్ముతున్నారు. అయితే ఇప్పటికే రేవంత్‌కు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని డిసెంబర్ 9న దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చసాగుతోంది.ఈ క్రమంలోనే మరో అసమ్మతి వర్గం నిరసన స్వరాన్ని వినిపిస్తోంది. పార్టీలో ఎప్పటినుంచో ఉంటున్న సీనియర్లను కాదని టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌కు పీసీసీ బాధ్యతలు ఎలా ఇస్తారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి వర్గం బహిరంగంగానే నిలదీస్తోంది. ఈ మేరకు అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతోంది. పీసీసీ పదవి తమకే ఇవ్వాలని కోమటిరెడ్డి సోదరులు విూడియా ముఖంగా పలుమార్లు డిమాండ్ చేశారు. పదవి తమకు దక్కనిపక్షంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరతామని రాజ్‌గోపాల్ చేసిన వ్యాఖ్యలు ఆ మధ్య పెను దుమారాన్నే లేపాయి. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ ఓటమి, ఉత్తమ్ రాజీనామా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలను ఆ పార్టీ నేతలు ఏ విధంగా ఎదుర్కొంటారనేది చూడాల్సిఉంది. ఇదిలావుంటే గ్రేటర్ ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఫలితాలు చూసి బొక్కబోర్లాపడింది. గతంలో చక్రంతిప్పిన గడ్డపైనే చతికలపడింది. ఓటమితో పోటీపడుతున్నట్లు నానాటికీ ప్రజాదరణ కోల్పోతుంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైన హస్తం పార్టీ.. ఈసారి కూడా అవే ఫలితాలను పునరావృత్తం చేసింది. కేవలం 2,24,528 ఓట్లతో 5శాతం వాటాను దక్కించుకుని దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇతర పార్టీలను ఏమాత్రం ఎదుర్కోలేక ఓటమి ముందు తలవంచింది. ఇప్పటికే వరుస ఓటములతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న పార్టీకి గ్రేటర్ ఎన్నికల పరాజయం ఆ పార్టీ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓవైపు సీనియర్ నేతలు ఒక్కకరూ పార్టీని వీడి కాషాయతీర్థం పుచ్చుకుంటుండగా.. కార్యకర్తలు సైతం తమదారి తాము చూసుకుంటున్నారు. ఈ తరుణంలో టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు, ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ పదవి నుంచి వైదులుగుతున్నట్లు ఓ లేఖను విడుదల చేశారు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక పక్రియను సైతం ప్రారంభించాలని ఏఐసీసీని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం నాటి నుంచి ఉత్తమ్ రాజీనామా కోసం పార్టీలోని ఓ వర్గం బలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో పార్లమెంట్, దుబ్బాక ఉప ఎన్నిక, బల్దియా పోరులో ఓటములతో ఆ ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో పదవికి రాజీనామా చెయకతప్పలేదు.