పుణ్యఫలాల పరిమిళం రంజాన్‌

తర్లుపాడు , జూలై 28 : రంజాన్‌మాసంలో ఉపవాసాలు విధిగా నిర్ణయించారు. ఉపవాసాలు మానవ హృదయాలను ప్రక్షాళన గావించి, దైవభీతిని, దైవ భక్తిని ప్రోదిచేసే అత్యుత్తమ సాధనం. ఈ నెలలోనే వెయ్యి నెలల కన్న ఎక్కువగా చేసిన దైవారాధనతో సామానంగా పరిగణిస్తారు. దుష్కార్యాలు గణనీయంగా తగ్గిపోతాయి. సమాజ వాతావరణంలో చక్కని అదనపు పుణ్యం సంపాదించుకోవడానికి ఇదొక సువర్ణ అవకాశం. ఫిత్రతో పేదలకు ఊరట ఫిత్రా ఆదేశాలు రంజాన్‌ నెలలోనే అవతరించాయి. వీటి వలన సమాజంలోని పేదలకు ఊరట లభిస్తుంది. అత్యధిక సంఖ్యాకులు జకాత్‌ రూపంలో దానధర్మాలు చేస్తారు. మానవుల ఇహపర ప్రయోజనాల సాఫల్యానికి ఉపకరించే అనేక అవకాశాలు పవిత్ర రంజాన్‌ మాసంలో ఉన్నాయి. అనాధిగా ఇది అన్ని కాలాల్లో సమాజాలలో చలామణిలో ఉన్నట్లు పవిత్ర ఖురాన్‌ ద్వారా కష్టమవుతుంది. ప్రతి ఆచరణకు 10 నుంచి 700 రెట్ల వరకు పుణ్యఫలం పెరిగిపోతుంది. మనసావాచా కర్మన ఉపవాసాలు పాటించే వారికి పుణ్యఫలం సిద్దిస్తుంది. మానవ సమాజ బలహీనత వలన ఏదోఒక పొరపాటు జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి పొరపాట్ల నుంచి ఉపవాశాన్ని (రోజా) దోషభరితంగా లోప రహితంగా తీర్చిదిద్దడానికి మహ్మద్‌ ప్రవక్త ఒక దానాన్ని ఉపదేశించారు. ఈ ప్రత్యేక దానాన్ని షరియత్‌ పరిభాషలో సదఖా ఫిత్రా అంటారు. ఫిత్రాదానం చెల్లించినంతవరకు రంజాన్‌ ఉపవాసాలు దైవ సన్నిధికి చేరవు. ఫిత్రాదానం వలన మరోగొప్ప సామాజిక ప్రయోజనం ఉంది. దీని వలన పేదలకు ఆర్ధిక వెసులుబాటు కలుగుతుంది. దీనిని కేవలం ఉపవాసులకు మాత్రమే పరిమితం చేయకుండా ఇంట్లో ఉన్న అందరికీ వర్తింప చేశారు. పండుగ నమాజ్‌కు ముందు జన్మించే శిశువుతో సహా కుటుంబంలోని ప్రతి ఒక్కరి తరపున ఒక్కొక్కరికి 50 రూపాయలు ఫిత్రా చెల్లించాలి. ఎంత పేదవారైనా ఫిత్రా, జకాత్‌ల రూపంలో అందే ఆర్దిక సహాయంతో వారు పండుగ సంబరాలలో ఆనందంగా పాల్గొంటారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆనందంతో సుఖసంతోషాలతో జీవనం గడుపుతూ పరలోకంలో దైవ ప్రసన్నతకు పాత్రులు కావాలన్నది ఇస్లాం ఆశయం. ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు ఉపవాసం వల్ల అనేక అధ్యాత్మిక, సామాజిక, వైద్యపరమైన లాభాలు ఉన్నాయి. దీని వలన సహగుణం పెరుగుతుంది. కష్టాలను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. హృదయంలో దైవభీతి జన్మిస్తుంది. శాంతి సంతృప్తిలకు నోచుకుంటుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనలకు దూరమవుతుంది. విశ్వాసులలో క్రమశిక్షణ, ఐకమత్యం, గాయం, ధర్మాలపై ఏకత ఏర్పడుతుంది. మానవహృదయాల్లో దైవగుణం, సానుభూతి, క్షమాపణ లాంటి సుగుణాలు జన్మిస్తాయి. పరోపకారం లాంటి ఉత్తమ గుణాలు అలవడుతాయి. ఆరోగ్య పరంగా చూస్తే జీర్ణకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. స్థూలకాయం సమస్య తీరుతుంది. అన్నింటికంటే ముఖ్యమైన మానవుడు చేసే పాపాలను కనుమరుగవుతుంది.