పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు పూర్తి
` కుటుంబసభ్యులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు
బెంగళూరు,అక్టోబరు 31(జనంసాక్షి): కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు అధికార లాంఛనాల నడుమ ఆదివారం ఉదయం పూర్తయ్యాయి. కంఠీరవ స్టూడియోలోని పునీత్ తల్లిదండ్రుల సమాధుల పక్కనే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పునీత్ అంత్యక్రియలకు కుటుంబసభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, యడియూరప్ప, సిద్ధరామయ్య, నటులు యశ్, సుదీప్, తదితరులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. పునీత్ రెండో సోదరుడు రాఘవేంద్ర కుమారుడు వినయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకు ముందు తెల్లవారు జామున 5 గంటల సమయంలో అంతిమయాత్ర జరిగింది. కంఠీరవ స్టేడియం నుంచి కంఠీరవ స్టూడియో వరకూ భారీ కాన్వాయ్ మధ్య పునీత్ అంతిమయాత్ర నిర్వహించారు. వేలాది మంది అభిమానుల నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.