పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు
– సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్ 19 జూలై (జనంసాక్షి) :పుష్కరాలు ముగిసే వరకు పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.పుణ్య స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు , లోటుపాట్లు లేకుండా చూసుకొవాలని ఆయన కొరారు. ఆదివారం క్యాంపు కార్యలయంలో ఆయన ఆధికారులతో సమీక్షించారు. ఆలాగే ఏర్పట్లలో ఉన్న అధికారులు మంత్రులతో టెలిఫోన్లో సంభాషించారు. పుష్కరాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పుష్కరాల్లో ఏర్పాట్లపై సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తలమునకలై ఉన్నారు. పుష్కర ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సవిూక్ష జరుపుతున్నారు. సీఎం ఆదేశాల మేరకు వివిధ జిల్లాల్లోని పుష్కర ఘాట్ల వద్ద ఆదివారం మంత్రులు ఈటల రాజేందర్, హరీష్‌రావు, లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జగదీశ్‌రెడ్డి, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎంవో అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు, అధికారుల నుంచి ఫోన్‌లో అడిగి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. భద్రాచలం, కాళేశ్వరం, బాసర, ధర్మపురిలో ఎక్కువ రద్దీ ఉన్నందున పరిస్థితిని సవిూక్షించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల్లో రవాణా ఏర్పాట్లపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ఎక్కడ ఎన్ని బస్సులు అవసరం ఉంటే అక్కడకు బస్సులను పంపాలని ఆర్టీసీ ఎండీ రమణారావును ఆదేశించారు. ఏపీ నుంచి భద్రాచలంకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది కనుక వారికి కూడా రవాణా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ కోసం ఒక హెలికాప్టర్‌ను భద్రాచలంలో అందుబాటులో ఉంచారు. కాగా, సీఎం ఆదేశాల మేరకు ఇవాళ బాసర నుంచి భద్రాచలం వరకు డీజీపీ అనురాగ్‌శర్మ హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే చేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.