పోలవరం టెండర్లను రద్దు చేయాలి
ఖమ్మం, ఆగస్టు 3 : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గల గిరిజన, గిరిజనేతరులను నిట్టనిలువునా ముంచే పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని, ఇందుకు టెండర్లను ఆపివేయాలని వీఆర్పురం మండల టీడీపీ అధ్యక్ష, కార్యదర్శులు రామారావు, నర్సింహరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత రైతన్నను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో ముంపు ప్రాంతాలలో రైతులకు, డ్వాక్రా మహిళలకు బ్యాంకు అధికారులు రుణాలు ఇవ్వడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ గృహాలు, మరుగుదొడ్లు సైతం మండలానికి మంజూరు చేయడంలేదన్నారు. మండలంలో ఎక్కడ చూసినా కరువు కాటకాలతో అల్లాడిపోతున్నాయని అన్నారు. గత ఆరు నెలల నుంచి వీఆర్ పురం మండలంలో వీధిదీపాలు ఏర్పాటు చేయకపోవడంతో గ్రామాలన్నీ అంధకారంలో ఉన్నాయని, పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైందన్నారు. ఆస్పత్రిలో వైద్యలు సక్రమంగా విధులు నిర్వహించడంలేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీఆర్ పురం మండలానికి సకల సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు.