పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేయలేదు: సీఎస్‌

హైదరాబాద్‌: సాగరహారంలో భాగంగా ఉద్యోగులపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ స్పష్టం చేశారు. ఈ రోజు తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు ఆమెతో సమావేశమయ్యారు. తెలంగాణ కవాతులో భాగంగా ఉద్యోగులపై అక్రమ కేసులు బనాయించారని తెలంగాణ ఉత్యోగుల ఐకాస ఇచ్చిన ఫిర్యాదుపై ఆమె డీజీపీ దినేష్‌ రెడ్డిని వివరణ కోరారు.  ఇవాళ ఇదే అంశమై సీఎం తెలంగాణ ఉద్యోగ ఐకాస నేతలతో సచివాలయంలో సమావేశమై చర్చించారు. సాగరహారంలో ఉద్యోగులపై ఎలాంటి కేసులు నమోదు  కాలేదని తనకు డీజీసీ నివేదిక ఇచ్చినట్లు మిన్నీ మాధ్యూ ఉద్యోగులకు  తెలియజేశారు. పోలీసులు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చారని ఉద్యోగ సంఘ నేతలు ఆరోపంచారు. 21 మంది ఉద్యోగులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని, త్వరలోనే ఆ వివరాలను సీఎస్‌కు, డీజీపీకి అందజేస్తామని చెప్పారు. తమపై నమోదు చేసిన కేసులను పోలీసులు బహిర్గతం చేసి ఎత్తివేయకుంటే దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.