ప్రకటనలకే పరిమితమవుతున్న మంత్రి కన్నా

గుంటూరు, జూలై 27 : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జిల్లాకు ఒరగబెట్టిందేమి లేదని స్థానిన శాసన సభ్యులు ధూళిపాళ్ళ నారేంద్ర కుమార్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం పొన్నూరు మండలం ములుకుదురులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి రెండు పదవులు ఎందుకు అని కన్నా విమర్శించడం బాగోలేదన్నారు. వ్యవసాయశాఖ మంత్రిగా ఉండి రైతులు పడుతున్న సమస్యలను పరిష్కరించకుండా ప్రకటనలకే పరిమితమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్‌ నేటికి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండా నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందన్నారు. సాగునీటిపై రోజుకొక ప్రకటన చేస్తూ రైతులను అయోమయానికి గురి చేస్తూ వారిని పాలకులు అయోమయంలోకి నెట్టివేస్తున్నారని విమర్శించారు. తెదెపా నాయకులు వెంకటేశ్వరరావు, రామారావు, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.