ప్రజల్లో భక్తిభావం పెంపొందించేందుకే ‘మన గుడి’

కర్నూలు, ఆగస్టు 2 : ప్రజల్లో నైతిక విలువలతో పాటు భక్తిభావాన్ని పెంపొందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు, ఎండోమెంటు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మనగుడి’ కార్యక్రమం సందర్భంగా నగరంలోని ఓల్డ్‌టౌన్‌ ప్రాచీన నాగేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన జిల్లా కలెక్టర్‌ సి. సుదర్శన్‌ రెడ్డికి వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గురువారం శ్రీ వేంకటేశ్వర స్వామి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రయుక్త శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని టిటిడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ‘మనగుడి’ కార్యక్రమంలో పాల్గొని నాగేశ్వరస్వామి, కలెక్టర్‌ అమ్మవార్లకు పూజలు చేసారు. అనంతరం ఎండోమెంటు అసిస్టెంటు కమిషనర్‌ శ్రీనివాసులు, ఆలయ వేదపండితులు కమలనాథ్‌ శర్మ, అనంతరామశర్మ రఘు, ఆలయ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు సత్యనారాయణతో కలిసి కలెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి, అడిషనల్‌ జెసి రామస్వామి, డిఆర్‌ఓ వేణుగోపాల్‌ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ మూర్తి, వ్యవసాయశాఖ జెడి ఠాకూర్‌ నాయక్‌, డిపిఆర్‌ఓ తిమ్మప్ప, బిసి కార్పొరేషన్‌ ఇడి నాగమునికి శాలువలు కప్పి ఘనంగా సత్కరించి స్వామి అమ్మవార్ల ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ, ఎండోమెంట్‌ సంయుక్త ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమాన్ని చేపట్టిందని, దీన్ని జిల్లా వాప్తంగా కుటుంబసమేతంగా దేవాలయాలకు వచ్చి మన సంస్కృతి, సనాతన ధర్మాన్ని పాటించాలని ఆయన ప్రజలను కోరారు. అనంతరం ఆలయ పూజారులు ఆలయం పక్కన డ్రైనేజి, దేవాలయ స్లాబ్‌ లీకేజి, ధ్వజస్తంభం తదితర సమస్యలు కలెక్టరుకు విన్నవించుకున్నారు. కాగా, ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మూర్తి, వెంకటేశ్వర్లకు కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు, ఎండోమెంటు అధికారులు, పూజారులు తదితరులు పాల్గొన్నారు.