సొంత పార్టీ నేతల ఫోన్లనూ ట్యాప్ చేశారు

` ఆ ఘనత బీఆరఎస్‌కే దక్కుతుంది
` తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
హైదరాబాద్(జనంసాక్షి): తాము కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే బీఆరఎస్ నేతలు జైల్లో ఉండేవారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. చట్ట ప్రకారమే కేసుల దర్యాప్తు ఉంటుందని తెలిపారు. గతంలో ప్రతిపక్ష నేతలవే కాదు సొంత పార్టీ నేతల ఫోన్లనూ ట్యాప్ చేశారని ఆరోపించారు. హైదరాబాద్ భూములను ప్రైవేట్ వాళ్లకు అక్రమంగా కట్టబెట్టారని విమర్శించారు. బీఆరఎస్ హయాంలో ఫోన్లు మాట్లాడాలంటే భయపడేవాళ్లమని వ్యాఖ్యానించారు. సింగరేణిలో అక్రమాలు ఎప్పుడు జరిగాయో తేటతెల్లం అవుతుందన్నారు. “నక్సల్స్ వంకతో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని అధికారులు చెప్పారు. నటులు, వ్యాపారులు ఏమైనా తీవ్రవాదులా.. ఎందుకు ట్యాప్ చేశారు. కవిత బయటపెట్టిన వాటికి ఆధారాలు ఇవ్వాలని కోరుతున్నా. 547 మంది ఫోన్లను ట్యాప్ చేశారని అధికారులు చెబుతున్నారు” అని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు.
బీఆరఎస్‌పై దయాకర్ తీవ్ర విమర్శలు
జైలుకు వెళ్లాలని బీఆరఎస్ నేతలకు బాగా ఉబలాటంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. “తెలంగాణలో ఎన్నికలంటే డబ్బులు, ప్రలోభాలు ఉండాలనే విధంగా బీఆరఎస్ తయారు చేసింది. విÖరు చేసిన పాపాలు, తప్పిదాలపై మరో ఐదేళ్లు విచారణ చేసినా సమయం సరిపోదు. డ్రోన్ కేసులో రేవంత్‌రెడ్డిని జైలుకు పంపారు. ప్రొఫెసర్ కొదండరామ్ ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేశారు. మేమెప్పుడూ రాజకీయ క్షక్ష సాధింపునకు పాల్పడలేదు. సిట్ అధికారులు, పోలీసులను కేటీఆర్ బెదిరిస్తున్నారు. అనైతిక రాజకీయాలు చేస్తున్నారు” అని విమర్శించారు.
కేటీఆర్, హరీశ్‌పై బల్మూరి వెంకట్ ఫిర్యాదు
మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ సందర్భంగా పోలీసు అధికారులను వారిద్దరు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.