మేడారం జాతరకు కేంద్రం సహాయం

రూ.3 కోట్ల 70 లక్షల నిధుల విడుదల
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో మంజూరు
న్యూఢిల్లీ(జనంసాక్షి):ఎట్టకేలకు మేడారం జాతరకు కేంద్రం భారీ సహాయాన్ని అందించింది. కేంద్ర ప్రభుత్వం రూ.3 కోట్ల 70 లక్షల నిధులను విడుదల చేసింది. గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం జాతరకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చొరవతో ఈ నిధులను విడుదల చేసింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిధులు మంజూరు చేశాయి. రెండేళ్లకు ఒకసారి నిర్వహించే మేడారం జాతరకు దేశ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు తరలివస్తుండటంతో.. భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిధులను విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ’గిరిజన సర్క్యూట’ పథకం కింద ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాల్లో పర్యాటక అభివద్ధి పనులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద గతంలో సుమారు రూ.80 కోట్ల వ్యయంతో ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం వంటి ప్రాంతాల్లో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అభివద్ధి పనులు కల్పించారు. రోడ్లు, వసతి సౌకర్యాలు, పర్యాటక సమాచార కేంద్రాలు, ఇతర సదుపాయాలు కల్పించడంతో ఈ ప్రాంతాలకు పర్యాటక ఆకర్షణ మరింత పెరిగింది. సమ్మక్క ` సారలమ్మల జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రతి జాతరతో భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం నిరంతరంగా సహకారం అందించడం గిరిజన సంస్కతి పరిరక్షణకు తోడ్పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా పొందిన రామప్ప దేవాలయం అభివద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.140 కోట్లను వెచ్చిస్తోంది. రామప్ప ఆలయం, మేడారం జాతర, పరిసర అటవీ ప్రాంతాలు అన్నింటినీ కలిపి తెలంగాణ గిరిజన, ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రత్యేక గుర్తింపునిచ్చేలా అభివద్ధి పనులు జరుగుతున్నాయి. అమ్మవార్లకు బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి, పొరుగు రాష్టాల్ర నుంచి లక్షలాది మంది భక్తులు మేడారం జాతరకు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల రవాణా సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే శాఖ జాతర జరిగే నాలుగు రోజుల పాటు 30 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్ల ద్వారా తెలంగాణతో పాటు ఆంధప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్టాల్ర నుంచి భక్తులు సులభంగా మేడారం చేరుకునేలా ఏర్పాటు చేశారు.