జనగనణకు కేంద్రం రంగం సిద్దం

33 ప్రశ్నలతో వివరాల సేకరణ
గెజిట్ విడుదల చేసిన సర్కార్
న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశ వ్యాప్తంగా జనగణనకు రంగం సిద్ధమైంది. రెండు దశల్లో జనగణన చేపట్టాలని ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. జనగణనలోనే కులగణన కూడా కేంద్రం చేపట్టనుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి తొలిదశ జనగణన ప్రారంభం కానుంది. తొలిదశలో గహ గణన కోసం కేంద్ర హోం శాఖ ప్రశ్నావళిని రూపొందించింది. 33 ప్రశ్నలతో మోదీ సర్కార్ గెజిట్ విడుదల చేసింది. ఇంటి వివరాలతో పాటు ఇంటర్‌నెట్, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల వాడకం, వాహన వినియోగం వంటి వివరాలు కూడా సేకరించాలని ఆదేశించింది. కుటుంబంలో ఎవరెవరు ఏయే పని చేస్తున్నారో స్పష్టమైన వివరాలు సేకరించాల్సిదే కేంద్రం తేల్చి చెప్పింది. ఏ విధమైన మరుగుదొడ్డి ఉందో రికార్డుల్లో స్పష్టంగా చెప్పాలని గణన అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్నానాల కోసం ఏ తరహా బాత్‌రూం ఉందో వివరాల్లో పొందుపరచాలని తెలపాలని వెల్లడించింది. వంట కోసం వాడుతున్న గ్యాస్ కనెక్షన్ వివరాలను కూడా అధికారులు సేకరించనున్నారు. ఇంటి యజమాని ఎస్సీ, ఎస్టీ, ఇతర ఏ వర్గానికి చెందిన వారో అనే వివరాలు తప్పక నమోదు చేయాల్సి ఉంటుంది.