.ప్రజల ఆకాంక్షలే రాజ్యాంగాన్ని తీర్చిదిద్దాయి
` జస్టిస్ ఎన్వీ రమణ
దిల్లీ,నవంబరు 14(జనంసాక్షి):న్యాయ వ్యవస్థ స్వతంత్రత, సమగ్రతను అన్ని దశల్లోనూ కాపాడటం ఎంతో కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఈ ఏడాది గాంధీ జయంతి రోజు జాతీయ న్యాయసేవల సంస్థ (నల్సా) ప్రారంభించిన దేశవ్యాప్త న్యాయ అవగాహన కార్యక్రమ ముగింపు సదస్సులో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. పేదరిక నిర్మూలన సహా న్యాయవ్యవస్థపై అవగాహనకు నల్సా చేపట్టిన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా సీజేఐ అభినందించారు.‘‘ట్రయల్ కోర్టులు, జిల్లా న్యాయ వ్యవస్థ తమ చర్యల ద్వారా భారత న్యాయవ్యవస్థ ఆలోచనలను కోట్లాది మంది ప్రజలకు తెలియజేయాలి. భారత్‌ను సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దడంలో భారత న్యాయవ్యవస్థ ముందు వరుసలో ఉంది. రాజ్యాంగ న్యాయస్థానాల నిర్ణయాలు సామాజిక ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నాయి. చట్టం మానవతా దృక్పథంతో పని చేయాలి. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, వారి ఆకాంక్షలే మన రాజ్యాంగాన్ని తీర్చిదిద్దాయి. ప్రతి ఒక్కరి జీవితాల్లో గౌరవం, సమానత్వాన్ని తీసుకురావడమే స్వాతంత్య్ర పోరాటం వెనక ప్రాథమిక ఉద్దేశం. కాని స్వతంత్ర భారతం.. వలస పాలకుల నుంచి వివిధ భాగాలుగా విడిపోయిన సమాజాన్ని వారసత్తంగా పొందింది. సంక్షేమ రాజ్యంలో భాగంగా ఉన్నప్పటికీ భారత్‌లో అభివృద్ధి ఫలాలు నిజమైన లబ్ధిదారులకు అనుకున్నంతగా చేరడం లేదు. గౌరవంగా జీవించాలన్న ప్రజల ఆకాంక్షలకు తరచూ సవాళ్లు ఎదురవుతున్నాయి. అందులో ప్రాథమికమైనది పేదరికం. ఈ సందర్భంలో గాంధీ జయంతి రోజు నల్సా చేపట్టిన అవగాహన కార్యక్రమానికి చాలా ప్రాధాన్యం ఉంది. రాష్ట్ర న్యాయ వ్యవస్థలు ప్రజలకు దగ్గరగా పని చేయాలి. అప్పుడే ప్రజల కష్టాలు తెలుస్తాయి’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.