ప్రణబ్‌కు ఎట్ల ఓట్లేస్తరో టీఎంపీ లే చెప్పాలి

ప్రణబ్‌ రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ ప్రధానాంశం కావాలన్న చర్చను మొదట కోదండరాం, తర్వాత సీపీఐ, ఆ తర్వాత తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్‌) దశాబ్ద పోరాట మహాసభలో లేవనెత్తింది. చాలా అంశాలను తెలంగాణ ఉద్యమ నాయకత్వం తెలంగాణకు అనుకూలంగా మార్చుకోలేదు. జారవిడుచుకుంది. అలా ఆందోళన ప్రతి అంశాన్ని తెలంగాణకు అనుకూలంగా వాడుకొని ఉంటే తెలంగాణ ఎప్పుడో వచ్చి ఉండేది. తెలంగాణ అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో మొదట వినిపించింది ఏపీజే అబ్దుల్‌ కలాం. ఆయన తెలంగాణకు అనుకూలమో, వ్యతిరేకమో ఆ చర్చ అప్రస్తుతం. యూపీఏ ప్రతిపాదిత రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ మాత్రం తెలంగాణకు బద్ద వ్యతిరేకి. గొర్రె కసాయివాడిని నమ్మినట్టుగా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ప్రణబ్‌ను నమ్ముతున్నారు. ప్రణబ్‌కే ఓటేసి గెలిపిస్తే రాష్ట్రపతి అయ్యాక తొలి సంతకం తెలంగాణ ఫైల్‌ మీద పెడతారన్న ఓ ఊహాజనితమైన విషయాన్ని ప్రజల ముందుంచి తాము అధిష్టానం ముందు ఎక్కడ మోకరిల్లారో, వచ్చే ఎన్నికల్లో ఎక్కడ టిక్కెట్లు ఇవ్వకుండా అధిష్టానం అడ్డుకుంటుందనే ఒకే ఒక భయంతో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఆత్మగౌరవాన్ని తెలంగాణ ద్రోహి ప్రణబ్‌ ముఖర్జీ ముందు తాకట్టు పెట్టారు. 2014లో దేశంలోని 56 పార్టీలు ఇందులో యూపీఏ, ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయి. తెలంగాణకి కావల్సిన మెజార్టీ కంటే ఎక్కువగానే అనుకూలంగా లేఖలు ఇవ్వగానే తెలంగాణ అంశాన్ని ప్రణబ్‌ తేల్చి ఉండాల్సింది. నిజానికి రాష్ట్రపతి ఎన్నిక మొదలురాష్ట్రల ఏర్పాటు,ఏ ఎన్నికలైన ఏకాభిప్రాయం కలిగి ఉండటం అంటే అది నియంతృత్వానికి. మెజార్టీ నిర్ణయాన్ని ఆమోదించడమే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య నిర్వచనమే భిన్నాభిప్రాయం. మెజార్టీ ప్రజలే రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ‘2009 డిసెంబర్‌ 9న నేను కోల్‌కత్తాలో ఉన్నాను. నేను ఢిల్లీలో ఉండి ఉంటే చిదంబరం ఈ ప్రకటన చేసి ఉండేవారు కాదు’ అన్న ప్రణబ్‌ ఎలా తెలంగాణకు అనుకూలం? గత ఎనిమిదేళ్లుగా ప్రణబ్‌ కమిటీని బుట్టదాఖలు చేసిన తెలంగాణ ద్రోహి ప్రణబ్‌. 800 మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలకు ఆయనే కారణం. అవునో, కాదో తెలంగాణ ఎంపీలు తేల్చి చెప్పాలి. తెలంగాణ అంశంపై లోకసభలో చర్చ జరిగేటప్పుడు విపక్ష సభ్యులు మాట్లాడాలన్నప్పుడు ‘ నేను మాట్లాడేందుకు ఏమీ లేదు’ అని మిన్నకుండిపోయిన ప్రణబ్‌కు మనం ఓట్లేసేందుకు …చెప్పాలి. తెలంగాణ ఎంపీలు ప్లకార్డులు పట్టి నిరసన ప్రదర్శన చేస్తూ పార్లమెంట్‌ బహిష్కరించి ప్రధాన ద్వారా ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తున్నప్పుడు తన చాంబర్‌కు పిలిపించిన మందలించడమే కాకుండా 2014లో టిక్కెట్లు రావని బెదిరించిన ప్రణబ్‌ తెలంగాణ ‘అనుకూలుడని’ ఎలా చెబుతారు? బహుషా ఇవే కారణాలను చూపెడతారేమో? తెలంగాణకు ఎలా ప్రణబ్‌ అనుకూలమో తేల్చకుండా ఒక్క జగన్‌ కోసం 20 మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేయగలిగినప్పుడు, నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మన ఎంపీలు ఎన్ని వీధి నాటకాలు, ఎన్ని పగటి వేషాలు వేస్తారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణ ఎంపీల వాదన ఎలా ఉన్నా సమిష్టి నిర్ణయాన్ని ఖుల్లం ఖుల్లాగా చెప్పకుండా 2014లో అధిష్టానం మెప్పుపొంది టిక్కెట్లు తెచ్చుకున్నా ప్రజా క్షేత్రంలో మాత్రం భంగపాటు తప్పదు.