ప్రతి నీటిచుక్కను సద్వినియోగం చేసుకోండి ఇందిరమ్మబాటలో సిఎం కిరణ్‌

శ్రీకాకుళం, జూలై 27 : రైతు ప్రయోజనార్ధం రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదుల యొక్క ప్రతి నీటి చుక్క సద్వినియోగం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారంనాడు ఆమదాలవలస మండల పరిధిలోని అక్కులపేట సమీపంలో గల మందరాడ కూడలిలో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ జలయజ్ఞం ప్రవేశపెట్టాక ప్రతి నీటి చుక్కను వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పోలవరం నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోందని, 80 టిఎంసిల నీటిని నిలుపు దల చేయగలిగితే 23 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వగలమని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 70వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. ఇంకా ఈ రెండు సంవత్సరాలలో 16వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి మరో 30 లక్షల ఎకరాలను సాగులోకి తేవాలన్నది లక్ష్యమని చెప్పారు. ప్రజలు ఆదరిస్తే ఈ ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి పథకాలతో ముందుకు సాగుతుంద న్నారు. మండలానికో.. ఒక స్టేడియం.. రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో ఒక స్టేడియం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సిఎం అన్నారు. విద్యార్థులను శారీరకంగా, మానసికంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రతి పాఠశాలలో ఒక పిరియడ్‌ క్రీడలపై శిక్షణ ఉండేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. ఆమదాలవలస మండలానికి 1.25 లక్షల రూపాయలతో స్టేడియం ఏర్పాటుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మరో 1.25 లక్షలతో సబ్‌ స్టేషన్‌కు, 25 లక్షలతో లైబ్రరీ కోసం శంకుస్థాపన పనులను ప్రారంభించారు. అనంతరం బూర్జ మండలం రాజుపేట గ్రామంలో ఒలిగడ్డ రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. తరువాత ఆధునిక పద్ధతిలో వరి విత్తనాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కొండ్రు మురళి, పార్ధసారధి, ఎంపి కృపారాణి, స్థానిక ఎమ్మెల్యే సత్యవతి, జిల్లా కలెక్టరు సౌరబ్‌గౌర్‌ తదితరులు పాల్గొన్నారు.